ప్రచార అనుమతులు తప్పనిసరి : జెసి

Apr 2,2024 21:59
ప్రచార అనుమతులు తప్పనిసరి : జెసి

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: భారత ఎన్నికల సంఘం- 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిర్దేశకాలను జారీ చేయడం జరిగిందని, వీటిని అభ్యర్థులు, అధికారులు తప్పనిసరిగా పాటించాలని జాయింట్‌ కలెక్టర్‌, చిత్తూరు అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి పి. శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని జాయింట్‌ కలెక్టర్‌ సమావేశపు మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రింటింగ్‌ ప్రెస్‌వారితో సమన్వయ సమావేశం నిర్వహించారు. జేసి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రచారాలు నిర్వహించుకోవచ్చునని, నోటిఫికేషన్‌ విడుదల అయిన తర్వాత ప్రచార ఖర్చులు అభ్యర్థి ఖర్చులుగా భావించడం జరుగుతుందన్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో అధికారులు కచ్చితంగా వ్యవహరించడం జరుగుతుందని, అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన అనుమతులు ఆన్‌ లైన్‌ లేదా ఆఫ్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకొని పొందవచ్చు అని, అనుమతులు లేకుండా ఎటువంటి ప్రచారాలు నిర్వహించకూడదని అన్నారు. సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అసెంబ్లీ అభ్యర్థికి రూ.40 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని, ఎన్నికలకు సంబంధించిన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు పరిశీలకులు రానున్నారని, ఎన్నికల ప్రచారం ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించి వారు ఎప్పుడైనా ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉందన్నారు. ఏవైనా సమస్యలు, సందేహాలు ఉన్నట్లయితే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆర్‌ఓతో పాటు నలుగురు ఏఆర్వోలు అందుబాటులో ఉంటారన్నారు. ఎన్నికల నియమావళి అమలుకు వివిధ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారికి సహకరించాలని కోరారు. ఏఆర్వోలు అరుణ, శ్రీనివాసులురెడ్డి, విజయలక్ష్మి, కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి లోకేష్‌, బీఎస్పీ ప్రతినిధి భాస్కర్‌, టిడిపి ప్రతినిధులు రాజసింహులు, జగన్మోహన్‌, రాజశేఖర్‌, వైయస్సార్సీపి ప్రతినిధులు విజయానంద రెడ్డి, ప్రతాప్‌, ఉదరు కుమార్‌ పాల్గొన్నారు.

➡️