బలిమెల రిజర్వాయర్‌ నీటి నిల్వలపై సమీక్ష

Jan 1,2024 17:38 #Chittoor District

ప్రజాశక్తి-సీలేరు : ఆంధ్ర ఒరిస్సా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి నిల్వలపై ఆయా రాష్ట్రాల అధికారులు జీకే వీధి మండలం సీలేరు ఏపీ జెన్కోకో అతిథి గృహంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023- 24 నీటి సంవత్సరం 2023 జూలై నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఎన్ని టీఎంసీలు నీటిని వినియోగించుకున్నదో లెక్కలు తేల్చారు. ఆంధ్ర 2022 -23 నీటి సంవత్సరంలో ఒరిస్సా కంటే అదనంగా వాడుకున్న 13.7578 టీఎంసీలతో కలిపి ఈ ఏడాది (2023- 24 నీటి సంవత్సరంలో) నవంబర్‌ 30 నాటికి 33.4957 నీటిని వినియోగించుకున్నట్లు నిర్ధారించారు. ఒరిస్సా ఇప్పటి వరకు 31.3932 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్లు లెక్కలు తేల్చారు. ఆంధ్ర, ఒడిస్సా కంటే ఇప్పటివరకు 2.1025 టీఎంసీలు నీటిని అదనంగా వినియోగించుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం బలిమెల, జోలాపూట్‌ జలాశయాల్లో 64.1397 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నట్లు తేల్చారు. ఇందులో ఆంధ్ర వాటాగా 31.0186 టిఎంసిలు, ఒరిస్సా వాటా 33.1211 టీఎంసీలుగా పంపకాలు జరిపారు. ఇరు రాష్ట్రాల గ్రిడ్‌ డిమాండు, ఇరిగేషన్‌ అవసరాలు నిమిత్తం ఆంధ్రాకు 2500 క్యూసెక్కుల నీటిని, ఒరిస్సాకు 1500 క్యూసెక్కుల నీటిని బలిమిలా జలాశయం నుంచి విడుదల చేయడానికి ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య అంగీకారం కుదురింది. ఈ కార్యక్రమంలో ఒడిస్సా తరపున పొట్టేలు ఇరిగేషన్‌ చీఫ్‌ కన్స్ట్రక్షన్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పితబాస్‌ శెట్టి, చిత్రకొండ ఎర్త్‌ డ్యాం డివిజన్‌ ఎస్‌ఈ రమాకాంత్‌ పాత్రో, ఏఈలు తుసార్‌ రాజన్‌ కుంత, గడదర్‌ ప్రధాన్‌, ఒరిస్సా హైడల్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ జ్యోతిర్మయిదాస్‌, సీలేరు ఏపీ జెన్కో ఎస్‌ఈ కేకేవి.ప్రశాంత్‌ కుమార్‌, ఈఈ జి.ప్రభాకర్‌, ఏడీఈ అప్పలనాయుడు, ఏఈ సిహెచ్‌. సురేష్‌ పాల్గొన్నారు.

➡️