బాబు, నేను పోటీ చేస్తే ‘మీ ఓటు ఎటు’?

Feb 21,2024 21:36
బాబు, నేను పోటీ చేస్తే 'మీ ఓటు ఎటు'?

ప్రజాశక్తి – శాంతిపురం, రామకుప్పం, పుంగనూరు ‘నిజం గెలవాలి’ నారా భువనేశ్వరి కార్యక్రమం రెండో రోజు కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగింది. శాంతిపురంలో నిజం గెలవాలి కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న నారా భువనేశ్వరి సభికులతో సరదాగా గడిపారు. ‘చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నేను పోటీచేస్తే నన్ను గెలిపిస్తారా..?’ అంటూ చమత్కరించారు. సభికులు ఇద్దరినీ గెలిపిస్తాం అంటే అలాకాదు ఎవరో ఒకరినే చెప్పాలంటూ సరదాగా సభికులతో మాట్లాడారు. సరదాగా అంటున్నా, నేను చాలా హ్యాపిగా ఉన్నా, రాజకీయాలకు తాను దూరం అంటూ చివర్లో వ్యాఖ్యానించారు. ఎపుడూ సీరియస్‌ చర్చలే కాదు, అపుడపుడు సరదాగా మాట్లాడుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ చర్చ చేసినట్లు చెప్పారు. మహిళలపై అత్యాచారాల్లో ఎపి నంబర్‌ 1 మహిళలపై అత్యాచారాల్లో ఎపిని నంబర్‌ 1గా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. శాంతిపురంలో ‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అంశంపై ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు స్త్రీ అబలగా ఉండేవారని, స్త్రీలకు గౌరవం, ధైర్యం, హక్కులు ఇచ్చి సమాజంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్‌ అని అన్నారు. 1986లో ఎన్టీఆర్‌ స్త్రీలకు ఆస్తిలో సమానహక్కును కల్పించి చరిత్ర సృష్టించారన్నారు. మహిళలకు ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీని తీసుకొచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ అమలు చేశారన్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్‌, డ్వాక్రా సంఘాలను చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చారన్నారు. ప్రొద్దుటూరులో ఆరేళ్ల బాలికపై అరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడితే ఆ నిందితుని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆర్డర్‌ వేస్తే, ఆ నిందితుడు ప్రాణభయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడన్నారు. దిశ చట్టం కాగితాలకే పరిమితమయ్యిందన్నారు. ఏపీని గంజాయి క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చారన్నారు. అన్నాక్యాంటిన్‌ ప్రారంభం శాంతిపురం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద, రామకుప్పం పోలీసు స్టేషన్‌ పక్కన అన్నా క్యాంటిన్‌ను ప్రారంభించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అద్యక్షులు పులివర్తి నాని, డాక్టర్‌ సురేష్‌, కుప్పం పార్టీ ఇన్చార్జి పిఎస్‌ మునిరత్నం, చంద్రబాబు పిఏ మనోహర్‌, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ్‌ నాయుడు పాల్గొన్నారు.పలు కుటుంబాల పరామర్శ పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం కతర్లపల్లి గ్రామంలో, పుంగనూరు నియోజకవర్గం ఎన్‌ఎస్‌పేటలో, మంగళం, ఒంటిమిట్ట గ్రామాల్లో కార్యకర్త కుటుంబాలను పరామర్శించారు. రాత్రికి మదనపల్లి టికెఎన్‌ గ్రాండ్‌ సిటీలో బస చేయనున్నారు. పలమనేరు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టిడిపి కార్యకర్తలు సై అంటే సై అని ధీటుగా పోరాడాలన్నారు. పెద్దపంజాణి: చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో మనస్థాపం చెంది మండలంలోని మాదనంపల్లి పంచాయతీ కత్తార్లపల్లి గ్రామానికి చెందిన శంకరప్ప మతి చెందారు. బుధవారం నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మండలంలోని మాదనంపల్లి పంచాయతీ కత్తార్లపల్లి గ్రామంలో మతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా శంకరప్ప చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబీకులను పరామర్శించి ఆర్థికసాయంగా రూ.3లక్షల చెక్కును అందజేశారు.

➡️