మిచౌంగ్‌ ప్రతాపం.. నిండామునిగిన రైతాంగం

Dec 5,2023 22:01
మిచౌంగ్‌ ప్రతాపం.. నిండామునిగిన రైతాంగం

పొంగిపొరలిన ‘కుశస్థలి’ పలు ప్రాంతాలు జలమయం వేగంగా సహాయక చర్యలునీటి మునిగిన పంటలువరికి తీవ్రనష్టం ప్రజాశక్తి- నగరి మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో శనివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా గాలులతో కూడిన జోరువర్షం కురిసింది. నగరి మండలంలో 309.2 మిల్లీ మీటర్ల వర్షం నమోదు కాగా, విజయపురంలో 278.8, నిండ్రలో 226 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం అధికంగా ఉండటంతో తాకిడికి పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కష్ణాపురం డ్యాం గేట్లు తెరిచిన కారణంగా కుశస్థలి నదిలో నీరు పొంగి పొర్లింది. ముందస్తు జాగ్రత్తగా కీళపట్టు లోతట్టు వంతెనకు ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉయ్యాలకాలువ పొంగి పొర్లడంతో టీఆర్‌.కండ్రిగ ఇందిరమ్మ కాలనీ, కాకవేడు ఏఏడబ్ల్యు, సాయినగర్‌, అశోక్‌ఈ నగర్‌ ప్రాంతాలు జలమయమయ్యాయి. తడుకుపేట శెట్టిగుంట ఎస్టీ కాలనీలో నివాసాలలోకి నీరు చేరింది. వారికి వైస్‌ఎంపీపీ కన్నియప్ప, స్థానిక నాయకుడు రాజేంద్ర ఆహారం పొట్లాలను అందించి భరోసా కల్పించారు. కీళపట్టు చెరువు పొంగి పొర్లడంతో నలుగురు రైతులకు చెందిన 14 ఎకరాల వరిపంట నీట మునిగింది.బాధితులకు సహాయం చేసిన గాలి భానుప్రకాష్‌ తుపాన్‌ ప్రభావంతో నగరి రూరల్‌ మండలం క్రిష్ణరామాపురం ఏఏడబ్ల్యు నీటమునిగిన ఇండ్లను నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌ పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి తన వంతు సహాయ చర్యలు చేపట్టారు. మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన నగరి రూరల్‌ మండలం వేలావడి ఎస్టీ కాలనీలో పర్యటించి బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.మంత్రి ఆదేశాలతో సహాయక చర్యలునియోజకవర్గంలో తుపాను బాధిత ప్రాంతాల్లో మంత్రి ఆర్కేరోజా ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు యుద్ద ప్రాతిపధిక సహాయక చర్యలు ప్రారంభించారు. మంత్రి సోదరులు రామ్‌ప్రసాద్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘం, ఎంపీపీ భార్గవి తుపాను బాధిత ప్రాంతాల్లో మంగళవారం విస్త్రుతంగా పర్యటించారు. మున్సిపల్‌ పరిధి చింతలపట్టెడ ఎస్టీ కాలనీలో పర్యటించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోజా ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా 60 కుటుంబాల వారికి 5 కేజీల బియ్యం, నూనె, కంది పప్పు, కూరగాయలు పంపిణీ చేశారు. ఎం.కొత్తూరు ఎస్టీ కాలనీలో 20 బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించారు. కౌన్సిలర్లు దయానిధి, అమర్‌, వైస్‌ ఎంపీపీ కన్నియప్ప, డిల్లి, ఆర్బీకే చైర్మన్‌ బుజ్జిరెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, వేలాయుధం, రవి, నరసింహులు, చంద్రకళ, దామునాయుడు, ట్రాన్స్‌కో డీఈ, ఏఈ పాల్గొన్నారు.వరికి తీవ్రనష్టం- నేలవాలిన కంకులు సోమల: మండలంలో తుపాను కారణంగా రెండు రోజులపాటు కురిసిన వర్షం వల్ల అనేక ప్రాంతాలలో వరి పైరుకు తీవ్రనష్టం కలిగింది. దీంతో పంట కోసి ఇంటికి చేర్చుకుందామనుకున్న రైతుకు తీవ్ర నిరాశ మిగిలింది. తుపాను కారణంగా ఎడతెరిపిలేని వర్షం కురవడంతో మండలంలో అధికశాతం రైతులు వరిని కష్టించి పండించారు. పంట చేతికి వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆశిస్తున్న సమయంలో కురిసిన వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. అధిక శాతం కోత దశలోని వరి పైరు ఉంది, వర్షం కారణంగా పంట పొలాలలోనే నేలకు ఒరిగిపోవడంతో పంటను కోయలేక అలాగే వదిలి వేయలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. నేలఒరిగిన పైరు పొలాల్లో నిలిచిన నీళ్ల వల్ల మొలకెత్తి వడ్లు పనికిరాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేసి పంటనష్టం ఎంత మేర జరిగిందో పరిశీలించి తమకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఎస్‌ఆర్‌ పురం: గత మూడు రోజులు కురుస్తున్న వర్షానికి వరి, మిరప, చెరుకు, పూల తోటలు నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపిరెడ్డిపల్లికి చెందిన హరిబాబు, రాజేంద్రయ్య అనే రైతులకు చెందిన సుమారు 5 ఎకరాల వరి పంట కోతకు వచ్చిన సయమంలో నీట మునగడంతో సుమారు రెండు లక్షల పైన నష్టపోయామని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పోతనపల్లి గ్రామంలో కౌలు రైతు సెల్వరాజ్‌ సుమారు ఎకరా చామంతి తోట నాటారు, చామంతి, బంతి పూలతోట నీట మునిగాయని, రూ.50వేలు నష్టపోయామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా నష్టపోయిన పంటకు ఆర్థిక సహాయం అందించాలని రైతుల కోరారు అలాగే పాతపాలెం, జిఎంఆర్‌ పురం, పాపిరెడ్డి పల్లె వాగుల్లో ఉధృతంగా ప్రవహిస్తుండంతో సుమారు 15 గ్రామాలకు పైగా రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఆర్‌పురం తహశీల్దారు బేన్ను రాజు, ఎంపీడీవో కష్ణయ్య, ఇరిగేషన్‌ ఏఈ భాస్కర్‌ రాజు, పోలీస్‌ సిబ్బంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే వాగులు వద్ద వీఆర్‌ఏలు, పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఎస్‌ఆర్‌ పురం: తుపాన్‌ నేపథ్యంలో సోమవారం కురిసిన వర్షాలకు ఎస్‌ఆర్‌ మండలంలోని ఎస్‌ఆర్‌ పురం. పాతపాలెం, పాపిరెడ్డిపల్లి, జిఎంఆర్‌పురం, కమ్మపల్లి గ్రామాలలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీని వలన సుమారు 15 గ్రామాలకు పైగా రాకపోకలు అంతరాయం కలిగింది. కొన్ని గ్రామాలలో మూగజీవాలు వాగులు వంకలు దాటలేక, పశుగ్రాసం దొరక్క పస్తులు ఉన్నాయని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెదురుకుప్పం: మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వర్షాలకు పూర్తిగా నిండిన చెరువుల నుంచి మొరవలు పోతున్నాయి. మండలంలోని 25 గ్రామ పంచాయతీలో ఉన్న చెరువులో అన్ని పూర్తిగా నిండి మొరవ పారుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు కళకళలాడాలి : ఏఈకార్వేటినగరం: కుశస్థలీ నదిపై నిర్మాణం చేపట్టిన కష్ణాపురం జలాశయం నీటితో చెరువులు నిండి నిత్యం కళకళలాడే విధంగా చూడాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆదేశించినట్లు ఇరిగేషన్‌ ఏఈ రవీంద్రనాయక్‌ తెలిపారు. మంగళవారం ఆయన జలాశయం సందర్శన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చుక్క నీటి బొట్టు వధా కాకుండా జలాశయం ఆయకట్టులోని 16 చెరువులను నింపి నిత్యం కళకళలాడే విధంగా చూడాలని ఆదేశించినట్లు ఏఈ వివరించారు. ఇప్పటి వరకు జలాశయంలో 150 ఎంసీఎఫ్‌ నీరు చేరిందని, జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి 200 క్యూసెక్కుల నీరు చేరుతున్నాయని జలాశయం పూర్తి స్థాయిలో నిండిన తరువాత గేట్ల ద్వారా కుశస్థలీనదిలోకి విడుదల చేస్తామని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు కుడి, ఎడమ కాలువల ద్వారా మాత్రమే నీటిని విడుదల చేసేందుకు కుడి, ఎడమ కాలువను మరమ్మతు చేసి నీటిని విడుదల చేసినట్టు పేర్కొన్నారు.

➡️