రగులుతున్న పుంగనూరు.!

రగులుతున్న పుంగనూరు.!

రగులుతున్న పుంగనూరు.!ప్రజాశక్తి-పుంగనూరు: ”పెద్దిరెడ్డి అడ్డాలో ఎన్ని అవరోదాలెదురైనా నిలబడ్డాం.. ఎత్తిన పార్టీ జెండా విడువకుండా పోరాటమే ఆయుధంగా పార్టీ విజయానికి కృషి చేశాం.. పోలీసులతో వచ్చినా.. దౌర్జన్యంగా వచ్చినా.. రక్తం చిందినా.. నిలబడి పసుపు జెండానే పట్టి ఎదురొడ్డి తిరుగుబాటు చేశాం.. జైల్లో మగ్గినా.. ఎన్నడూ వెన్నుచూపలేదు.. అలాంటిది టీడీపీ విజయం సాధించి పట్టుమని 15 రోజులు కూడా గడవలేదు.. అంతలోనే ప్రత్యర్థి పార్టీ మున్సిపల్‌ ఛైర్మన్‌, 12మంది కౌన్సిలర్‌లను ఎలా టీడీపీలోకి చేర్చుకుంటారు..” అని పుంగనూరు టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. అవమానించిన వారిని అక్కున చేర్చుకొని పార్టీ శ్రేణుల మనోభావాలు లెక్క చేయరా అంటూ టీడీపీ అదినాయకత్వంపై తముళ్లు తీవ్ర స్థాయిలో విరుచకుపడుతున్నారు. ప్రత్యర్థులతో పాటు.. సొంత పార్టీపై కూడా తిరగపడే పరిస్థితులు తెచ్చుకోవద్దంటూ ఓ రకంగా హెచ్చరిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనానంతరం ఆ స్థానం మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అడ్డాగా మారింది. అయన ఇక్కడ నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లా వైసీపీ పార్టీ తరఫున అన్ని తానై వ్యవహరిస్తున్నారు. గెలిచిన నాలుగు దఫాల్లో మూడు సార్లు అత్యధిక మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అంచువరకూ వెళ్లి ఊహించని స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.పక్కకు తప్పుకొనే పరిస్థితి నుంచి ఎదురొడ్డి నిలబడే స్థాయికి.. టీడీపీ స్థానంలో 2009లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి పెద్దిరెడ్డి రాజకీయ చతురత ముందు తప్పుకున్న టీడీపీ నేతలే ఎక్కువని చెప్పాలి. దాదాపుగా నియోజకవర్గంలో టీడీపీని అణచివేశారు పెద్దిరెడ్డి. నాలుగు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన వైసీపీ అక్కడి ప్రత్యర్థి పార్టీ, అన్యాయాలను ఎదురించిన వారిపై అణచివేసే ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో మొదలైన తిరుగుబాటు పెద్దిరెడ్డిని ఎదుర్కొనే స్థాయికి టీడీపీ శ్రేణులు ముందుకు అడుగేశారు. అడుగడుగునా టీడీపీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి పెద్దిరెడ్డికి ఎదురుగా పసుపు జెండా పట్టి నిలబడ్డారు.పుంగనూరు అల్లర్లతో మరింత దూకుడు.. ఏడాధి కిందట ప్రతిపక్ష హోదాల్లో ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరుకు వచ్చారు. పుంగనూరు బైపాస్‌ రోడ్డు మీదుగా వెళ్లే క్రమంలో పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ నేతలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టి నల్లబెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకొని పోలీసుల జోక్యం, అల్లర్లుతో టీడీపీ నేతలపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదైయ్యాయి. అదే క్రమంలో టీడీపీ నేతలకు రక్తం చిందింది. అప్పటి నుంచి పుంగనూరులో వైసీపీని ఓడించేందుకు టీడీపీ శ్రేణులు దూకుడుగా వ్యవహరించాయి.15ఏళ్లుగా కేసులే కేసులు.. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీసీవై పార్టీ నేతలు, సానుభూతి పరులపై 15ఏళ్లుగా వరుస కేసులు నమోదైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. తీవ్ర అనచివేతకు యత్నించిన క్రమంలో పుట్టిన తిరుగుబాటు పెద్దిరెడ్డిని ఎదురించే వరకూ వెళ్లిందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజా రెండు దఫాలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటకు సిద్ధమవడంతో ముందుగానే టీడీపీ శ్రేణులు ”గో బ్యాక్‌ పెద్దిరెడ్డి” అంటూ నినాదాలు చేయడంతో పాటు వస్తే అడ్డుకొని తీరుతామంటూ ఆందోళన సైతం చేపట్టారు. దీంతో పెద్దిరెడ్డి పర్యటనను విరమించుకున్నారు.తాజా పరిణామాలతో టీడీపీ నేతల గుర్రు తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు) స్వల్ప మెజారిటీతో పరాజయం పాలైయ్యారు. టీడీపీ అధికారం చేపట్టాక చల్లా బాబు సమక్షంలో ఆయన నివాసం వద్ద పుంగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌, 12మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ కేడర్‌ పూర్తిగా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ ఎవరి వల్ల ఇబ్బందులు పడ్డామో వారికే పసుపు తివాచీ వేయడం విడ్డూరమంటూ రగిలిపోతున్నారు.సొంత పార్టీ తీరుపై మనోవేదన వైసీపీ నేతల వల్ల బాధింపబడి, జైలులో మగ్గి, దెబ్బలుతిని, లాఠీ దెబ్బలకు అల్లాడిన తమను కాదని పొరుగు పార్టీ నేతలను ఎలా చేర్చుకుంటారని టీడీపీ నేతలు ఆ పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుమని 15 రోజులు కూడా గడవకనే పాలనమెచ్చి వస్తున్నామంటున్న నేతలను ఎలా నమ్ముతారంటూ మండిపడుతున్నారు. పెద్దిరెడ్డే పంపించారా.. లేక.. ఇనాళ్లూ చేసిన అవినీతి అక్రమాల నుంచి బయటపడటానికి టీడీపీలోకి వచ్చారా.. అంటూ పరిపరివిధాలుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ చేసిన అక్రమాలు పార్టీ మారితే సక్రమమైపోతాయా అంటూ తెలుగుతమ్ముళ్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. టీడీపీ అదినాయకత్వం తీరును మార్చుకోకుంటే సొంత పార్టీపై కూడా తిరుగుబాటు చేయకతప్పదనే హెచ్చరికలు చేస్తుండడం పుంగనూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉంది.

➡️