తల్లిపాల దాతలకు వందనం

Apr 3,2024 22:36
తల్లిపాల దాతలకు వందనం

ప్రజాశక్తి – తిరుపతి తిరుపతి ప్రసూతి వైద్యశాల రెండో అంతస్తులో రోటరీక్లబ్‌ సౌజన్యంతో తల్లిపాల నిల్వ నిధిని బుధవారం ప్రారంభించారు. ఎస్‌వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌, రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.రవి ప్రభు, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పార్థసారథిరెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. డాక్టర్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ తల్లిపాల నిధి పాలు లేని బిడ్డలకు బతుకునిస్తుందన్నారు. ఓ మహిళ తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను స్వచ్ఛందంగా దానం చేయడానికి ముందుకు వచ్చే ఆరోగ్యకరమైన తల్లుల దగ్గర నుంచి పాలను సేకరించి, సమగ్రంగా పరీక్షలు నిర్వహించి, భద్రపరచి అవసరమైన చిన్నారులకు అందిస్తారన్నారు. దీన్నే తల్లిపాల నిధి అంటారని తెలిపారు. డాక్టర్‌ పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ తల్లిపాలకు కులమత వర్ణ వర్గ, పేద ధనిక బేధాలు లేవన్నారు. ఆరోగ్యకరమైన ఏ తల్లి ఇచ్చిన పాలనైనా, ఏ బిడ్డకైనా పట్టవచ్చనే నినాదంతో రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో తిరుపతి రోటరీక్లబ్‌ సహాయార్ధంతో ప్రారంభించామన్నారు. చిన్నపిల్లల తల్లులు ఈ గొప్ప అవకాశాన్ని ఉచితంగా అందిపుచ్చుకోవాలన్నారు. డాక్టర్‌ జి.రవిప్రభు మాట్లాడుతూ దాతల నుంచి పాలను రెండు విధాలా సేకరిస్తారన్నారు. దాత ఇంటి నుంచి మిల్క్‌ బ్యాంక్‌ యూనిట్‌ స్థాపించిన వైద్యశాల నుంచి అని తెలిపారు. ప్రసూతి వైద్యశాలలో రెండో అంతస్తు రూమ్‌ నంబర్‌ 5, 6 లలో ఈ భాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. బ్రెస్ట్‌ పంపు ద్వారా 30 నుంచి 40 మిల్లీ లీటర్ల వరకు దాతలు పాలు ఇవ్వవచ్చు. దాతలు తమ సమ్మతిని తెలియజేసే దరఖాస్తును ఆధార్‌కార్డు ఆధారిత చిరునామా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ (సుశానా హెల్త్‌ ఫౌండేషన్‌) మాట్లాడుతూ ఓ తల్లి పాలు ఇంకో బిడ్డకు ప్రాణం పోస్తుంటే ఆ సంతోషం వెలకట్టలేనిదన్నారు. మిగులుపాలు ఉన్న తల్లులు ఆలోచించాల్సిన విషయమన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీహరి మాట్లాడుతూ తిరుపతి రోటరీక్లబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పాలను దానం చేయడం వల్ల దాతలకు ఎన్నో లాభాలున్నాయని వివరించారు. ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాదని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ప్రిడియాటిషన్‌ తిరుపతి సరితా చౌదరి కలకత్తా, డాక్టర్‌ శ్రీనాథ్‌ మణికంఠ సీనియర్‌ కన్సల్టెంట్‌ నియో నేటాలజీ బెంగళూరు, ప్రసూతి వైద్య విభాగాధిపతి డాక్టర్‌ ప్రమీల, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్‌ మనోహర్‌, చిన్నపిల్లల విభాగ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏఎస్‌ కిరీటి, తిరుపతి రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ ఫణి రాజ్‌ కుమార్‌, సెక్రటరీ రోటరీ క్లబ్‌ రవికుమార్‌, చైర్మన్‌ దామోదరం పాల్గొన్నారు .

➡️