బీసీలపై అగ్రవర్ణాల దాడి దారుణం

Jun 16,2024 20:47
బీసీలపై అగ్రవర్ణాల దాడి దారుణం

బాధితులకు తగిన న్యాయం చేయాలి
రాష్ట్ర గౌడ సంఘం కార్యదర్శి బుస నాగరాజ్‌ గౌడ్‌
ప్రజాశక్తి-చిత్తూరుడెస్క్‌: యాదమరి మండలం మోటాంగ్లపల్లెలో బీసీలపై అగ్రవర్ణాలు దాడి చేయడం హేయమైన చర్య అని రాష్ట్ర గౌడ సంఘం కార్యదర్శి నాగరాజు గౌడ్‌ అన్నారు. ఆదివారం ఆయన బంగారుపాళ్యంలో విలేకరులతో మట్లాడారు. యాదమరి మండలం మోటాండ్లపల్లిలో రెడ్డి సమాజికవర్గానికి చెందిన లోకనాథ్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి, జీవరత్నంరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డిలు అదే గ్రామంలోని గుట్టపొరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని డీకేటీ పట్టా తెచ్చుకున్నట్లు ఆయన వివరించారు. అయితే ఆ స్థలంలో తరతరాలుగా గ్రామస్తులు కాటమరాజు గుడిని నిర్మించుకొని పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో శనివారం గ్రామస్తులు పూజలు చేయడానికి వెళ్లిన సందర్భంగా ఈడిగగౌడ సంఘీయులపై వారు దాడికి పాల్పడినట్లు చెప్పారు. పతకం ప్రకారం కత్తులు, కారంపొడి, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారని మండిపడ్డారు. దీంతో గ్రామస్తులకు రక్తగాయాలైనట్లు పేర్కొన్నారు. దౌర్జన్యంగా బరితెగించి బీసీలపై అగ్రవర్ణాలు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. దాడిచేసిన వారిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. వివిదానికి కారణమైన డీకేటి పట్టాను రద్దు చేసి ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధింపపడ్డవారికి తగు న్యాయం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం ఉపాధ్యక్షులు జనార్థన్‌ గౌడ్‌, జిల్లా గౌడ యువసేన ప్రధాన కార్యదర్శి లేబాకుల మురళి గౌడ్‌, మండల గౌడ్‌ సంఘం నాయకులు మాధవరావు గౌడ్‌, బాబుగౌడ్‌, ప్రభాకర్‌ రావు గౌడ్‌, వేణుగోపాల్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

➡️