నేడు టంగుటూరులో సిఎం ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మంగళవారం టంగుటూరు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్‌పి గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సోమవారం పరిశీలించారు. టంగుటూరులో జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలీప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గాన టంగుటూరుకు చేరుకుంటారు. సెంటర్‌లో కొండపి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి బస్సు మీద నుంచి ప్రసంగించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లకు కూడా పరిశీలించారు. వైసిపి కొండపి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌తో మాట్లాడి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పర్యటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పిలు నాగేశ్వరరావు, శ్రీధర్‌ రావు,. ఒంగోలు డిఎస్‌పి కిషోర్‌ బాబు, శింగరాయకొండ సిఐ దాచేపల్లి రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయండికొండపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరులో మంగళవారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని వైసిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైసిపి కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ కోరారు. టంగుటూరులోని వైసిపి కార్యాలయం వద్ద కొండపి నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిజగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచార నిమిత్తం మంగళవారం ఉదయం 10:30 గంటలకు టంగుటూరుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొండేపి నియోజకవర్గంలోని ఆరు మండలాల వైసిపి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యటించారు.

➡️