రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి : కలెక్టర్‌

May 4,2024 23:06

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పోలింగ్‌ రోజు, పోలింగ్‌కు ముందు రోజు ప్రచురించే రాజకీయ ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసిఎంసి) అనుమతి తప్పనిసరి అని పల్నాడు జిల్లా ఎన్నికలాధికారి, జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ చెప్పారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఎంసిఎంసి ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్‌ రోజు, పోలింగ్‌కు ముందు రోజు ప్రింట్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదన్నారు. గతంలో పలు సందర్భాల్లో ప్రింట్‌ మీడియాలో అభ్యంతరకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు గుర్తు చేశారు. వీటివల్ల ప్రభావితమయ్యే అభ్యర్థులు, పార్టీలకు వివరణ/ఖండన అందించే సమయం కూడా ఉండనందున ఎన్నికల చివరి దశలో ఇటువంటి ప్రకటనలు మొత్తం ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ గుర్తించిందన్నారు. ఆవేశపూరితమైన, తప్పుదోవ పట్టించే, విద్వేషపూరిత ప్రకటనల కారణంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటోందన్నారు. రాజకీయ ప్రకటనలకు సంబంధించి దరఖాస్తును ప్రచురణ రోజుకు కనీసం 3 రోజులు ముందుగా ఉంటుందన్నారు. వార్తాపత్రిక ప్రకటనల ముందస్తు ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి, జిల్లా స్థాయిలో కమిటీలను అప్రమత్తం చేశామని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఇతర సంస్థల నుండి అందిన ప్రకటనలను కమిటీలు త్వరితగతిన పరిశీలించి, ధ్రువీకరిస్తాయని తెలిపారు.

➡️