రోడ్డు మార్జిన్‌ ఆక్రమణపై ఫిర్యాదు

72వ వార్డు కార్పొరేటర్‌, సిపిఐ ఫ్లోర్‌ లీడర్‌ ఎజె స్టాలిన్‌

సిఎంఆర్‌ కాంప్లెక్స్‌ నిర్వాహకులపై చర్యలకు స్టాలిన్‌ డిమాండ్‌

ప్రజాశక్తి-గాజువాక : పాత గాజువాక కూడలి సమీపంలోని సిఎంఆర్‌ కాంప్లెక్స్‌ యాజమాన్యం హైవేను ఆనుకుని రోడ్‌ మార్జిన్‌ను ఆక్రమించి తాళ్ళు కట్టి నో పార్కింగ్‌ బోర్డులు ఏర్పాటు చేయడాన్ని జివిఎంసి 72వ వార్డు కార్పొరేటర్‌, సిపిఐ ఫ్లోర్‌ లీడర్‌ ఎజె స్టాలిన్‌ తప్పుబట్టారు.ఈ మేరకు శుక్రవారం విశాఖ నగర పోలీసు కమిషనర్‌, జివిఎంసి కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రోడ్డు మార్జిన్‌ను ఆక్రమించిన సిఎంఆర్‌ యాజమాన్యంపై తక్షణమే తగుచర్యలు తీసుకోవాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేసారుసిఎంఆర్‌ కాంప్లెక్స్‌ యాజమాన్యం హైవేను ఆనుకుని రోడ్‌ మార్జిన్‌ను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడి, ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. సిఎంఆర్‌ కాంప్లెక్స్‌ వెనుకనున్న చైతన్య నగర్‌ కాలనీలో పలు విద్యా సంస్థలు ఉండడంతో విద్యార్థులు, పాదచారుల రాకపోకలతో ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని ఆక్షేపించారు.. తక్షణమే గాజువాక పోలీసులు, జివిఎంసి యంత్రాంగం స్పందించి సిఎంఆర్‌ కాంప్లెక్స్‌ యాజమాన్యం ఆక్రమించిన రోడ్‌ మార్జిన్‌ను తొలగించి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేసారు.

సిఎంఆర్‌ కాంప్లెక్స్‌ వద్ద తాళ్లు, బోర్డులతో రోడ్‌ మార్జిన్‌ ఆక్రమణ

➡️