ముగిసిన అగ్ని ప్రమాద వారోత్సవాలు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండపాలెం అగ్ని మాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగిన అగ్ని ప్రమాద వారోత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా యర్రగొండపాలెంలోని అగ్ని మాపక కేంద్రంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. అగ్ని మాపక కేంద్రంలో ఉపయోగించే పలు పరికరాలను చూపుతూ వాటి పని తీరును వివరించారు. ఉపయోగించే విధానం తెలిపారు. ఈ సందర్భంగా అగ్ని మాపక అధికారి జివి రవి మాట్లాడుతూ వారం రోజులు పాటు అగ్ని మాపక కేంద్రం పరిధిలోని ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. గ్యాస్‌, విద్యుత్‌ ప్రమాదాలు, తదితర ప్రమాదాల పట్ల కూడా అవగాహన కల్పించామని అన్నారు. పాఠశాలలు, పెట్రోల్‌ బంకులు, సినిమా హాళ్లు, అపార్ట్‌మెంట్‌లు, వైద్యశాలలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. వేసవిలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే సెల్‌ నెంబర్‌ 99637 33791కి సమాచారం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది వి వెంకటేశ్వర్లు, సిహెచ్‌వి రవిబాబు, పికె నాయక్‌, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

➡️