చెరువుల ఆక్రమణపై కోర్టులో కేసు

Jun 15,2024 21:16

ప్రజాశక్తి-బొబ్బిలి :  మున్సిపాలిటీలో చెరువుల ఆక్రమణపై కోర్టులో ప్రజా వాజ్యం కేసు వేసేందుకు ప్రజా సంఘాలు తీర్మానించాయి. స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు మాట్లాడుతూ పట్టణంలో చెరువుల ఆక్రమణకు గురవుతున్నా నివారణకు అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. చెరువులు ఆక్రమణకు గురికావడంతో భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్ము నాయుడు మాట్లాడుతూ చెరువుల ఆక్రమణపై సమగ్ర దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చెరువుల ఆక్రమణపై ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. సిపిఐ జిల్లా నాయకులు కోట అప్పన్న మాట్లాడుతూ చెరువుల ఆక్రమణలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటంతోనే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెరువుల ఆక్రమణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలని కోరారు. ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.గోపాలం మాట్లాడుతూ చెరువుల ఆక్రమణతో రైతులకు సాగునీరు అందకపోవడంతో పంటలు పండక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చెరువుల ఆక్రమణపై కోర్టులో న్యాయ పోరాటం చేయాలనిప్రజా సంఘాల నాయకులు తీర్మానించారు. కార్యక్రమంలో లోక్‌సత్తా నాయకులు డి.సురేష్‌, సిఐటియు నాయకులు ఎ.సురేష్‌ పాల్గొన్నారు.

➡️