ఉద్రిక్తలను తగ్గించడానికి ప్రధాన పార్టీలు బాధ్యత తీసుకోవాలి : సిపిఎం

May 16,2024 00:12

ప్రజాశక్తి – క్రోసూరు : ఎన్నికల సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులను చల్లార్చడానికి ప్రధాన రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు కోరారు. ఈ మేరకు స్థానిక ఆమంచి భవన్‌లో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. పోలింగ్‌ రోజైన గత సోమవారం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో వైసిపి, టిడిపి శ్రేణులు పరస్పర దాడులు చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఆయా గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని, వాటిని నియంత్రించకపోతే భవిష్యత్తులో వివిధ సామాజిక తరగతుల మధ్య వివాదాలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు బాధ్యత తీసుకుని వివాదాల్లేకుండా చూడాలన్నారు. ప్రజలు కూడా ఆలోచించి ఉద్రిక్తతలకు లోనవ్వకుండా సహనంతో వ్యవహరించాలని కోరారు. ఉద్రిక్త పరిస్థితులున్న గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సందర్భంగా బైండోవర్‌ చేసిన వారితో మాట్లాడి శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్రిక్త పరిస్థితులకు ఒక రకంగా మద్యం కారణ మని, గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా పట్టించు కోవడం లేదని విమర్శించారు. సత్వరమే మద్యం విక్రయా లను నియంత్రించాలని, కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

➡️