సిపిఎం సానుభూతి పరుడుసూర్యప్రకాశరావు మృతి

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన సిపిఎం సానుభూతిపరుడు స్వర్ణ సూర్యప్రకాశరావు (66) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సిపిఎం రాష్ట్ర నాయకుడు జాలా అంజయ్య, జిల్లా నాయకుడు ఎస్‌కె.మాబు, మండల కార్యదర్శి టి.శ్రీకాంత్‌ ,జి.బసవపున్నయ్య, కందుల రవి తదితరులు ఆదివారం సందర్శించారు. మృతదేహంపై సిపిఎం జెండా కప్పి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు సూర్యప్రకాశరావు మృతి సిపిఎం నిర్వహించే పోరాటాలకు తీరనిలోటని తెలిపారు. సూర్యప్రకాశరావు తొలి నుంచి సిపిఎం సానుభూతి పరుడుగా ఉంటూ 1980 నుంచి వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కూలీ పోరాటాలు, రైతు పోరాటాలు, భూపోరాటాల్లో చురుకైన పాత్ర పోషించినట్లు తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు, భూములు ఇప్పించేందుకు ఎంతో కషి చేశారన్నారు. మాజీ మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్యతో సన్నిహితంగా మెలగారన్నారు. చెంచయ్య ఆధ్వర్యంలో పేదలకోసం నిర్వహించిన పోరాటాల్లో సూర్యప్రకాశరావు పాల్గొనేవారని తెలిపారు. సూర్య ప్రకాశరావు తుది శ్వాస వరకూ సిపిఎం సానుభూతిపరుడుగా కాలనీలో కామ్రేడ్‌గా పిలవబడ్డారన్నారు ప్రాణాలు కోల్పోయే సమయంలో తమ మృతదేహంపై సిపిఎం జెండా కప్పాలని బంధువులకు చెప్పడం ఆయన నిబద్దతకు నిదర్శనమని పేర్కొన్నారు. సూర్యప్రకాశరావు ఆశయాలను వారి బంధువులు కొనసాగించాలని సూచించారు.

➡️