ఉత్తరాంధ్ర ప్రశాంతతను చెడగొట్టొద్దు : బొత్స

బొత్స సత్యనారాయణ

స్వార్థ రాజకీయాల కోసం

ఉత్తరాంధ్ర ప్రశాంతతను చెడగొట్టొద్దు : బొత్స

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : స్వార్థ రాజకీయాల కోసం ఉత్తరాంధ్ర ప్రశాంతతను చెడగొట్టొద్దని, బుధవారం విశాఖ పార్లమెంటు పరిధిలోని కంచరపాలెంలో జరిగిన దాడి ఘటనను రాజకీయ కోణంలోకి తీసుకువచ్చి లేనిపోని అపోహలు సృష్టించవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ సంఘటనకు రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు. శుక్రవారం సాయంత్రం లాసన్స్‌ బే కాలనీలోని బొత్స ఝాన్సీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్‌ 9న రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో ప్రమాణస్వీకారం చేయనున్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే శాంతియుతంగా, సోదరభావంతో ఉండే ప్రాంతమని తెలిపారు. శాంతియుతమైన ఈ ప్రాంతంలో రాజకీయ లబ్ధి కోసం లేనిపోని ఆరోపణలు చేస్తూ అల్లర్లను ప్రేరేపించవద్దని అన్నారు. ఇదే సందర్భంలో రాజకీయ నాయకులు కూడా అనవసరమైన నిందారోపణలు చేయడం తగదన్నారు. ఏ ప్రాంతంలో అధికారులను మార్చారో అక్కడే అల్లర్లు మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు బొత్స సమాధానం చెబుతూ ఏ ప్రాంతంలో అధికారులను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని అన్నారు. ఎన్నికల కమిషన్‌ నియమించిన ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల తాము గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. ఇలాంటి సున్నితమైన సమయాల్లో ఒక అధికారిని నియమించే ముందు ఆ అధికారి పూర్వాపరాల గురించి కూడా తెలుసుకోవాలని తెలిపారు. గతంలో ఆ అధికారి ఉద్యోగ బాధ్యతల్లో ఎలా పనిచేశారు ? ఆయన కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి ? అన్న విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అలా చేయకపోవడం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ అల్లర్లు జరిగాయని తాము గవర్నర్‌కు చెప్పామని అన్నారు. అధికారులెవరైనా చట్టానికి లోబడి పరిపాలన చేయాలిగానీ పక్షపాత ధోరణితో ఉండరాదని అన్నారు. రుషికొండలో కట్టినవి అధికారిక భవనాలని, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటిని ఏం చేయాలో నిర్ణయిస్తామని, ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉంచాలా ? లేదా ముఖ్యమంత్రి పరిపాలనా భవనంగా పెట్టాలా ? అనేది గెలిచాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

➡️