బోగస్‌ సంస్థల అభిప్రాయాలను పట్టించుకోవద్దు- సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ఎన్నికల నిర్వహణ విధానంలో ప్రజలకు, ఓటర్లకు ప్రమేయం లేకుండా, వారి అభిప్రాయం లేకుండా జరగరానిది ఏదో మరోసారి జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని, బోగస్‌ సంస్థల అభిప్రాయాలను పట్టించుకోవద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. సోమవారం రాజంపేట పట్టణంలో ఇండియా వేదిక బలపరిచిన సిపిఐ రాజంపేట శాసనసభ అభ్యర్థి బుక్కే విశ్వనాథ నాయక్‌ తరపున రాజంపేటలోని రాంనగర్‌, పాత బస్టాండ్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇంత ఘోరంగా, దుర్మార్గంగా అసమర్థ పాలన చేస్తున్నా, వైఫల్యం చెందినా తిరిగి ఈ పార్టీ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టనున్నారని.. దాదాపు అన్ని బాడుగ సంస్థలు, బోగస్‌, నకిలీ సంస్థలు.. తమ అశాస్త్రీయ, ఊహాజనిత సర్వేలలో పేర్కొంటూ, ఊదర గొట్టుతున్నాయన్నారు. ఈ బోగస్‌ సర్వే సంస్థల విశ్వసనీయత, పనితీరు, ప్రామాణికతపై అనేక అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొందన్నారు. సకాలంలో ప్రతి నెల ఒకటి, రెండూ తేదీలలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, కాంట్రాక్టు, పొరుగు సేవలు సహా వివిధ పేర్లతో తాత్కాలిక సేవలు అందిస్తున్న చిరు ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయమని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్‌.నరసింహులు, జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు టి.రాధాకృష్ణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్‌, సిపిఐ రాజంపేట నియోజకవర్గ కార్యదర్శి ఎం.శివరామకృష్ణదేవరా, సహాయ కార్యదర్శి ఎమ్మెస్‌ రాయుడు, రైల్వే కోడూరు ఏరియా కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, నాయకులు పట్టణ కార్యదర్శి సికిందర్‌, కేశం ప్రసాద్‌ రాజశేఖర్‌, నాగమ్మ శివయ్య పాల్గొన్నారు.

➡️