అమరావతిపై ద్వంద్వ వైఖరి

May 8,2024 00:50

రాజధాని అమరావతి శంకుస్థాపనలో ప్రధాని మోడీ (ఫైల్‌)
ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి :
సుదీర్ఘకాలం తర్వాత బుధవారం విజయవాడ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచార సభలో రాజధాని అమరావతిపై స్పందిస్తారా లేదా అన్న అంశంపై ఈ ప్రాంత వాసుల్లో చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం గ్రామంలో 2015 అక్టోబరు 22న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తామని మోడీ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే అదేరోజు నిధులపరంగా ఎటువంటి హామీ ఇవ్వలేదు. రాజధాని నిర్మాణానికి కేవలం రూ.1500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈనిధులతో అప్పటి సిఎం చంద్రబాబు నాయుడు తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలు మాత్రమే నిర్మించారు. ఇంతకు మించి నిధులు ఇవ్వడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ససేమిరా అంది. దాదాపు లక్ష కోట్ల అంచనాలతో అప్పటి టిడిపి ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై ప్రణాళికలు రూపొందించింది. ఇవ్వన్నీ కార్యరూపం దాల్చలేదు. నవ నగరాలు ఏర్పాటు చేస్తామని టిడిపి ప్రభుత్వం ప్రకటించింది. ఆ పేరుతో వేల ఎకరాలను రైతుల వద్ద నుండి తీసుకున్నారు. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములను రైతులు ఇచ్చారు. కానీ వారికి ఇంత వరకు రిటర్నబుల్‌ ప్లాట్లు దక్కలేదు. కాగితాల్లోనే ఈ ప్లాట్లు ఇచ్చినా అభివృద్ధి చేసి ప్లాట్లు అప్పగించలేదు. ఎపి సిఆర్‌డిఎ చట్టం ప్రకారం మొదటి మూడేళ్లలోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాల్సి ఉన్నా టిడిపి హయంలో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా ఈ ప్రక్రియ కొనసాగుతుందని రైతులు ఆశించారు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో సిఎం జగన్‌ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగున్నరేళ్లపాటు మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని కోరుతూ రైతులు 1600 రోజులపాటు సుదీర్ఘకాలం ఉద్యమం నిర్వహించారు. రెండుసార్లు పాదయాత్రలు చేశారు. ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల వరకు తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని స్పష్టం చేశాయి. వైసిపి మాత్రం మూడు రాజధానుల నినాదం కొనసాగిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో వైసిపి గెలిస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, తన ప్రమాణ స్వీకారం విశాఖలోనే జరుగుతుందని సిఎం జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించారు. రైతుల ఉద్యమాన్ని భేఖాతరు చేస్తూ వైసిపి తన మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది. మూడు రాజధానుల అంశంపై గత నాలుగున్నరేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తూ వచ్చింది. ఓ వైపు రాజధాని అమరావతికి అనుకూలమేనని బిజెపి నాయకులు చెబుతుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం న్యాయస్థానాల్లో అందుకు భిన్నంగా అఫిడవిట్లు దాఖలు చేసింది. రాజధాని అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిందని హైకోర్టు, సుప్రీంకోర్టులకు కేంద్ర హోం శాఖ తెలిపింది. దీంతో వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులపై మరింత మొండిగా ముందుకు వెళ్లింది. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని పూర్తి చేయాలన్న సంకల్పం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పెద్దలకూ లేకుండాపోయింది. అలాగే ప్రధాని హామీ ఇచ్చినట్లు ప్రపంచ స్థాయి కాదు కదా కనీసం సాధారణ స్థాయి రాజధాని నిర్మాణం కూడా జరగలేదు. దీంతో రాజధాని అమరావతి శిథిలావస్థకు చేరుకుంటున్న అసంపూర్తి భవనాలతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఇందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది. తెలంగాణ ఎన్నికలకు ముందు అమరావతిలోని రాజధాని గ్రామాల్లో బిజెపి పాదయాత్ర చేసి హైదరాబాద్‌లో సెటిలర్స్‌ ఓట్ల కోసం ఎత్తుగడ వేసింది. కానీ తెలంగాణాలో కూడా ఆశించిన ఫలితాలు పొందలేకపోయింది. రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం… వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడంపై అమరావతి రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంత జరిగినా టిడిపి, జనసేన పార్టీలు ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ బిజెపితో పొత్తుపెట్టుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి అనుకూలంగా ప్రకటన వస్తుందా రాదా అని రాజధాని ప్రాంత ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

➡️