అనపర్తిలో వేడెక్కిన రాజకీయం

Mar 3,2024 23:12
అనపర్తిలో వేడెక్కిన రాజకీయం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనపర్తిలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎంఎల్‌ఎ టిడిపి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రస్తుత ఎంఎల్‌ఎ సత్తి సూర్యనారాయణ రెడ్డి మద్య వాగ్యుద్ధం తార స్థాయికి చేరింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో అనపర్తి నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సైతం ఎంఎల్‌ఎ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆచరణలో అమలు చేయలేదని మాజీ ఎంఎల్‌ఎ నల్లమల్లి రామకృష్ణారెడ్డి విమర్శలను ఎక్కుపెడుతున్నారు. పేదల కోసం కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల్లో గ్రావెల్‌ తరలింపు, కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఎంఎల్‌ఎ సూర్యనారాయణ రెడ్డి రూ.500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నరు. ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు ఇద్దరూ సిద్ధమవడంతో మార్చి ఒకటో తేదీన పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. రామకృష్ణారెడ్డిని పోలీసులు తమ వాహనంలో తరలించగా, ఎంఎల్‌ఎ సూర్యనారాయణ రెడ్డిని ఆయన ఆస్పత్రి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యం విమర్శలు ప్రతి విమర్శలు అధికార, విపక్ష నేతలు 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విమర్శలు, ప్రతి విమర్శలకు తెరతీస్తున్నారు. అనపర్తి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ, ప్రజా పార్టీ, జనతాపార్టీ అభ్యర్థులు ఒకొక్కసారి గెలుపొందగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు నాలుగుసార్లు, టిడిపి అభ్యర్థులు మూడుసార్లు విజయం సాధించారు. 1962లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పాలచెర్ల పనశరామన్న విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కేవలం 1373 ఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్ధి సత్తిసూర్యనారాయణరెడ్డిపై, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి నలమల్లి రామకృష్ణారెడ్డిపై, వైసిపి అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి 55,207 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో వైసిపి గెలిచిన స్థానాల్లో అనపర్తి నియోజక వర్గం ఒకటి. గెలిచిన ఐదేళ్లలో ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే విమర్శలు ఉన్నాయి. అనపర్తి నుంచి బిక్కవోలుకు వెళ్లే కెనాల్‌ రోడ్డు కోసం నాలుగుసార్లు పాదయాత్ర చేసిన సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎంఎల్‌ఎగా గెలిచి ఐదేళ్లయినా రహదారిసైతం వేయలేకపోయారు. దీంతో పాటు అవినీతి ఆరోపణల నేపధ్యంలో పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు టిడిపి, జనసేన కూటమి వేగం పెంచింది.అమలుకు నోచుకోని ఎన్నికల హామీలు2019 ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీలు సైతం ఆచరణలో అమలుకు నోచుకోలేదు. అనపర్తి-బిక్కవోలు రోడ్డు పూర్తి చేయలేదు. ఈ ప్రాంతం నుంచి రాష్ట్రం నలుమూలలా వెళ్లి వడ్డీ వ్యాపారం చేయటం పరిపాటి. ఈ నేపథ్యంలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ హాల్ట్‌ హామీ అమలుకు కాలేదు. కాపవరంలో ప్రభుత్వం పేదల ఇళ్లకోసం కొనుగోలు చేసిన 118 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని, గ్రావెల్‌ తరలింపులో చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. కరోనా సమయంలో ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కోసం ఎంఎల్‌ఎ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. దీనిలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శలు విన్పిస్తున్నాయి. తాజాగా ఈ ప్రాంతంలో గ్లూకోజ్‌ ఫ్యాక్టరీ లాకౌట్‌ ప్రకటించింది. దీనిలో ఉపాధి పొందుతున్న 300 మంది కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎంఎల్‌ఎ సూర్యనారాయణరెడ్డి యాజమాన్యంతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వంతో చర్చలు జరిపి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానంటూ ఎంఎల్‌ఎ హామీ ఇచ్చారు.

➡️