ఎన్నికలపై రాజకీయ పార్టీలు సహకరించాలి

Mar 23,2024 23:36
ఎన్నికలపై రాజకీయ పార్టీలు సహకరించాలి

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌అన్ని రాజకీయ పార్టీలూ, పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలకోడ్‌కు కట్టుబడి ఉండాలని, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. శనివారం కలెక్టర్‌ ఛాంబర్‌లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో మోడల్‌ ప్రవర్తనా నియమావళి ఫిర్యాదులపై జిల్లా స్థాయి ప్రామాణిక కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ, సహృదయ వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుకోవడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబందించిన అంశాలపై ఆశావహ దృక్పథంతో చర్చించి వాటికి పరిష్కారం కోసం కమిటీ సభ్యులు సూచనలు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో కమిటీ సభ్యులుగా ఏడు రాజకీయ పార్టీలకు చెందిన వారిని నియమించినట్టు తెలిపారు. బిఎస్‌పి-పట్నాల విజరు కుమార్‌, బిజెపి-బొమ్ముల దత్తు, ఆమ్‌ ఆద్మీ పార్టీ-మన్నవ రఘురాం, సిపిఎం-పి.అరుణ్‌ కిరణ్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌-అరిగెల అరుణ, టిడిపి-కెఎస్‌ జవహర్‌, వైసిపి-జక్కంపూడి రాజాను కమిటీలో నియమించినట్టు చెప్పారు. కమిటీ చైర్మన్‌గా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత, మెంబర్‌-కన్వీనర్‌గా రుడా విసి బి.బాలస్వామి వ్యవహరిస్తారని మాధవీలత తెలియ చేశారు. ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా సాగేందుకు, వివిధ దశల్లో రాజకీయ పార్టీలు, పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి గుర్తించిన వాటిపై కమిటీలో చర్చించి అభిప్రాయాలు పరిగణన లోకి తీసుకుని ఆ మేరకు కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించి సూచనలు అభిప్రాయాలు మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎటువంటి ప్రచారం నిర్వహించినా ‘ఎన్‌ కోర్‌” యాప్‌ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ర్యాలీల నిర్వహణా సమయంలో కనీస దూరం పాటించడం, గోడలపై ఎటువంటి రాతలు రాయకూడదు అని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రకృతి విపత్తులు, తదితర అత్యవసర పరిస్థితుల్లో కమిటి సమావేశం నిర్వహించి, కమిటీ సభ్యుల అభిప్రాయాలు మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదుల నమోదు కోసం జిల్లాలో టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800- 425 – 2540 కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలూ మూడు షిఫ్ట్‌లలో ప్రజలు, రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1950 కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సి విజిల్‌ యాప్‌ ద్వారా వచ్చేయ ఫిర్యాదుల విషయంలో 100 నిమిషాల్లో స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యుల్‌ 4వ విడతలో నిర్వహిస్తున్న మేరకు నియమావళిని అనుసరించి ప్రవర్తించాల్సిన నియమ నిబంధనలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న దష్ట్యా 24 అంశాలకు సంబంధించిన అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని, వాటి వివరాలు అందచేశామన్నారు. ఉల్లంఘనలకు సంబందించి తెలిసి తెలియక చేసినా వాటిపై వివరణ కోరతామని, వాటిపై కమిటీ సభ్యుల సమక్షంలో చర్చించి అభిప్రాయాలు మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారున. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, సభ్యులు- కన్వీనర్‌ బి.బాల స్వామి, సభ్యులు పి.ప్రదీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️