టిడిపి అభ్యర్థిని గెలవనివ్వం

Feb 27,2024 23:40
జగ్గంపేట

విలేకర్ల సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాటంశెట్టి
నాలుగో రోజుకు నిరవధిక దీక్ష
ప్రజాశక్తి-గోకవరం
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిని గెలవనివ్వబోమని జనసేన పార్టీ ఇన్‌ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర వెల్లడించారు. పాటంశెట్టి దంపతులు అచ్చుతాపురంలో చేపట్టిన దీక్ష మంగళవారం నాటికి నాలుగోరోజుకు చేరింది. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన వద్ద డబ్బు లేని కారణంగా టిక్కెట్టు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ పొత్తు ధర్మాన్ని తప్పకుండా నేటి వరకు టిడిపికి అనుకూలంగానే ఉన్నానన్నారు. దీక్ష చేపట్టి నాలుగు రోజులు గడుస్తున్నా జ్యోతుల నెహ్రూ కనీసం పరామర్శించకపోవడం దారుణమన్నారు. జ్యోతుల నెహ్రూ పొత్తు ధర్మాన్ని పాటించబోమని, జనసేనకు ఓటు వేయబోమని గతంలోనే అయన అన్న విషయాన్ని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జగ్గంపేట నుంచి పోటీ చేస్తే లక్ష మెజార్టీతో గెలుపును బహుమతిగా ఇస్తానన్నారు. గడిచిన ఐదేళ్లకాలంలో జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి కుటుంబసభ్యులతో కలిసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశామన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వబోమని స్పష్టం చేశారు. పవన్‌కళ్యాణ్‌ జగ్గంపేట నుంచి పోటీ చేసే నిర్ణయాన్ని త్వరితగతిన వెల్లడించాలని, అప్పటి వరకు దీక్ష కొనసాగుతుందని లేని పక్షంలో తన భార్యతో కలిసి తుది శ్వాస విడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️