నేడు ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’

Jan 28,2024 00:08
సిపిఎస్‌

రాజమహేంద్రవరంలో పెన్షన్‌ సాధన సభ
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి
సిపిఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ సాధన కోసం అన్ని రాజకీయ పక్షాలతో ఆదివారం రాజమహేంద్రవరంలో ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ పేర సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని ఎస్‌కెవిటి కళాశాల ఆవరణలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ సభ జరుగనుంది. ఈ సభను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌, ఎన్‌.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ సభకు అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించారు. ఎవరైతే పాత పెన్షన్‌(ఒపిఎస్‌)ను ఇస్తామని చెప్పి, తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతారో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి సిపిఎస్‌ రద్దుచేసి ఒపిఎస్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని విస్మరించారు. ఈ నేపథ్యంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో పలుపోరాటాలు జరిగాయి. అయినప్టపికీ ప్రభుత్వంలో స్పందన లేకపోగా జిపిఎస్‌ అంటూ కొత్త పాట అందుకున్నారు. ఇది సిపిఎస్‌ కంటే ప్రమాదకరమైందని, ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని గ్రహించారు. దీంతో జిపిఎస్‌ రద్దు కోసం కూడా పలు పోరాటాలను నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాలతో పాటూ ఉద్యోగ సంఘాలు దీనికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో భాగస్వాములయ్యాయి. సమస్యను పరిష్కరించకపోగా ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసేందుకు కుయుక్తులు పన్నింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కక్షపూరిత చర్యలకు సైతం పాల్పడింది. పెన్షన్‌ అనేది ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు చెప్పినా వైసిపి సర్కారు ఏకపక్షంగా వ్యవహరించింది. ఇచ్చిన హామీని అమలు చేయకుండా పోరాటాలను ఉక్కుపాదంతో అణచివేయటంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో పాటూ వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో మరో పోరాటానికి వారు సిద్ధమయ్యారు. అందులో భాగంగా రాజమహేంద్రవరంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటూ అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహణకు నడుంబిగించింది. ఈ సభలో ఒపిఎస్‌ సాధన కోసం భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమైంది. సభను జయప్రదం చేయాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయి నాయకత్వంతో పాటూ మండల స్థాయి వరకూ ప్రచారం జరిగింది. పోస్టర్లను సైతం పలుచోట్ల ఆవిష్కరించారు. రానున్న పోరాటాలకు ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ సభ బీజం పోయనుంది. ఇప్పటికే సభకు అన్ని ఏర్పాటు చేశామని శనివారం యుటిఎఫ్‌ నాయకత్వం మీడియా ముఖంగా తెలిపింది. ఈ సభలో వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొంటారని పేర్కొంది. ఒపిఎస్‌ సాధన సభ జయప్రదానికి పిలుపు చాగల్లు : రాజమహేంద్రవరం ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం జరిగే ఒపిఎస్‌ సాధన సభను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి పట్టా రవివర్మ పిలుపునిచ్చారు. చాగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సభకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. డిమాండ్లను అన్ని రాజకీయ పార్టీల ముందుంచి, స్పష్టమైన హామీలతో బాటు వారి మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారికే మద్దతు ఇస్తామన్నారు. ఈ సభకు అత్యధిక మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరై జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల సహా అధ్యక్షులు టి.సత్తిరాజు, ప్రధాన కార్యదర్శి పట్టా రవివర్మ, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాసమూర్తి, గంగాధర్‌, ఆదిబాబు, తన్వీర్‌, రమేష్‌బాబు, హరిప్రియ, గాయత్రిదేవి పాల్గొన్నారు.

➡️