పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

Feb 28,2024 23:54
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి వివిధ సమన్వయ శాఖల అధికారులు సిబ్బందితో డిఆర్‌ఒ నరసింహులు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఆర్‌ఒ మాట్లాడుతూ జిల్లాలో 2024 మార్చి 18 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు సంబంధించి మొత్తం 30,116 మంది హాజరుకానున్నారని, వీరిలో బాలురు 15,819 మంది, బాలికలు 14,297 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు 29,990 మంది కాగా ఒఎస్‌ఎస్‌సి ప్రైవేట్‌ విద్యార్థులు 126 మంది ఉన్నారన్నారు. జిల్లాలో 137 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులను 8.45కు కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఆలస్యంగా వచ్చిన వారిని కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు నిర్వహించే ఈ పరీక్షలను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎటువంటి పొరబాట్లు దొర్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు 5 ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, స్క్వాడ్స్‌ ప్రతిరోజూ ఆయా కేంద్రాలను తనిఖీ చేస్తాయని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరీక్షల విధుల్లో ఉన్నవారు మినహా బయటి వ్యక్తులను కేంద్రాల్లోకి అనుమతించరని చెప్పారు. ఈ సమావేశంలో ఎఎస్‌పి పి.అనిల్‌ కుమార్‌, డిఇఒ కె.వాసుదేవరావు, డిప్యూటీ డిఇఒ ఇవిఎస్‌ఎస్‌ఎస్‌విఎల్‌.నారాయణ, కెఎస్‌ఎంవి.కృష్ణారావు, ఎన్‌వి.సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️