బిజెపి పొత్తుతో కూటమిలో సెగ

Mar 10,2024 23:49
బిజెపి పొత్తుతో కూటమిలో సెగ

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిటిడిపి, జనసేన కూటమిని బిజెపి పొత్తు సెగ వెంటాడుతోంది. బిజెపితో పొత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించిన విషయం విదితమే. అయితే తాజా నిర్ణయం కూటమి నేతలకు లాభనష్టాలు తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న విధానాలకు గత ఐదేళ్లుగా అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి పోటీ పడి పార్లమెంటులో మద్దతు తెలిపిన విషయం విదితమే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పార్టీకి అధికార, విపక్ష పార్టీలు తమ మద్దతు తెలపడానికి తెరవెనుక రాజకీయాలే కారణమనే ఆరోపణలు సైతం లేకపోలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యక్ష మద్దతు కోసం టిడిపి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పటికే టిడిపి, జనసేన మద్దతు నేపథ్యంలో టిడిపి ఆశావహుల్లో నిరుత్సాహం నెలకొంది. తాజాగా బిజెపితో పొత్తు కుదరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టిడిపి, జనసేన కూటమి ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసిన విషయం విదితమే. జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానానికి గానూ కేవలం మూడు సీట్లకు మాత్రమే తొలిజాబితాలో చోటు దక్కింది. పార్లమెంటు స్థానం బీజేపీకే…?రాజమండ్రి పార్లమెంటు స్థానం బీజేపీకే కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తారని తెలుస్తోంది. టిడిపి, జనసేనతో బిజేపీ పొత్తు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు పార్లమెంటు స్థానాలు, జనసేన-బీజేపీకి కలిపి 30 స్థానాలు కేటాయంచిన విషయం విదితమే. అయితే బిజేపీ పార్లమెంటు స్థానాలపై కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కోరిన స్థానాల్లో రాజమహేంద్రవరం కూడా ఒకటని తెలుస్తోంది. గతంలో గెలుపొందిన నియోజకవర్గం కావటంతో కలిసొస్తుందని బిజేపీ ఆశిస్తోంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం విభజన హామీలు అమలు చేయటంలో బిజేపీ రాష్ట్రానికి మొండి చేయి చూపించింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయటంలోనూ పూర్తి నిర్లక్ష్యం వహించింది. మరోవైపు మైనార్టీలు, క్రైస్తవులపైన దాడులు ఇటీవల పెరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బిజేపీతో పాటు ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న టిడిపి కూటమికీ ప్రతికూల పరిస్థితులుత ప్పవనే సంకేతాలు విన్పిస్తున్నాయి.టిడిపి-జనసేనలో సర్దుపోట్లుజిల్లావ్యాప్తంగా 7 నియోజక వర్గాల్లో ఇప్పటికే టిడిపిలో ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. నిడదవోలు నియోజకవర్గంలో బూరుగుపల్లి శేషారావు, ప్రముఖ వ్యాపారవేత్త కుందుల సత్యనారాయణ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరినీ కాదని జనసేనకు కేటాయించటంతో కందుల దుర్గేష్‌ ఈ స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే టిడిపి నేతల నుంచి ఏ మేరకు సహకారం లభిస్తుందో వేచి చూడాలి. గోపాలపురం నియోజకవర్గంలో మద్దిపాటి వెంకటరాజుకు సొంత పార్టీలోనే అసమ్మతి వెంటాడుతోంది. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి జవహర్‌, అదే పార్టీలో మద్దిపట్ల శివరామకృష్ణ రెండు వర్గాలుగా ఏర్పడి అధినేత నుంచి ఎవరికి వారే టికెట్‌ ఆశిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజక వర్గంలో సినీయర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ నియోజక వర్గంలో జనసేన నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదరువక తప్పదని తెలుస్తోంది. రాజానగరం టికెట్‌ ఆశించి భంగపడిన టిడిపి నేత బొడ్డు వెంకట రమణచౌదరి వర్గం ఇప్పటికే అసమ్మతిని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో బిజేపీతో జట్టు కడితే ఏడు నియోజక వర్గాల్లో ఏ నియోజక వర్గం కేటాయిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

➡️