భవన కార్మికుల బోర్డును నిర్వహించాలి

Mar 2,2024 23:29
భవన కార్మికుల బోర్డును నిర్వహించాలి

ప్రజాశక్తి -దేవరపల్లిభవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నిర్వహించాలని, 1214 మెమోను రద్దు చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.సుందరబాబు డిమాండ్‌ చేశారు. శనివారం బస్టాండ్‌ వద్ద కార్మికులు కొనసాగిస్తున్న దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో, సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని చెప్పారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు ద్వారా రాష్ట్రంలో పదేళ్ల పాటు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయన్నారు. ఆయన కుమారుడు వైఎస్‌.జగన్‌ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి తూట్లు పొడిచారన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందకుండా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. మరో వైపు కరోనా కాలం నుంచి నేటి వరకు భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించడంలో కార్మికులను ఆపద సమయంలో ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి డి.సువర్ణరాజు శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. వైఎస్‌.జగన్‌ పరిపాలన విధానం రాజ్యాంగ విరుద్ధమైనదని, నూతన ఇసుక పాలసీ విధానమంటూ ఉచిత ఇసుకని వ్యాపారం చేశారని చెప్పారు. ఆనాటి కంటే ఈనాడు 100 శాతం అధికంగా ఇసుక అమ్ముతున్నారని చెప్పారు. దీక్షలో మండల అధ్యక్షుడు అయినపర్తి శ్రీను, గేలం సత్యనారాయణ, సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కె.ఏసుబాబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె.రత్నాజీ భవన నిర్మాణ కార్మికులు సాధనాల పండు, సాధనాల వెంకటరమణ, కె.సత్యనారాయణ, ఎం.శీను బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️