మట్టి మాఫియా ఆగడాలు

Feb 21,2024 22:32
మట్టి మాఫియా ఆగడాలు

ప్రజాశక్తి- గోకవరం గత రెండు, మూడు సంవత్సరాలుగా గోకవరం మండలం అచ్యుతాపురం, బాబాజీపేట కొండల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగు తున్నాయి. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు స్థానికులు మొరపెట్టుకున్న, సమాచారం ఇచ్చిన పట్టించుకున్న పాపాన పోవడంలేదు. కనీసం ఫోన్లో కూడా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రజలు సతమతం అవుతున్నారు. మట్టి లారీలు కొండల నుండి రవాణా చేసే సమయంలో మెయిన్‌ రోడ్డు ఎక్కేటప్పుడు ఆ మట్టి తారు రోడ్డుపై పడి గోకవరం నుండి రాజమండ్రి వెళ్లే రహదారి అంతా బురదతో నిండిపోతోంది. దీంతో ఎదుటి నుంచి వచ్చే వారికి వాహనాలు కనబడక ప్రమాదాల గురవుతున్నారు. బుధవారం వెదురుపాక, బాబాజీపేట గ్రామస్తులు మట్టి లారీలను అడ్డుకున్నారు. యథేచ్ఛగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. స్థానికులు అందరూ ఏకమై మట్టి లారీలను అడ్డుకున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు స్థానికులు సమాచారం అందించినా ఎంతసేపటికీ వారు అక్కడకు రాకపోవడంపై స్థానికులు ఆవేదన చెందారు. మండలంలోని ఎక్కడ ఇటువంటి అక్రమాలకు జరగకుండా చూడవలసిన అధికారులు సమాచారం అందించినా పట్టించుకున్న పాపాన పోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తిమవుతున్నాయి. రోడ్డుపై లారీలు అతివేగంగా వెళ్లడం, లైసెన్సులు లేని వారితోను, అర్హత లేని వారితోనూ లారీలు నడిపించడం వీటికి తోడు శబ్ధాకి ఎప్పుడు ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం కన్నెత్తి చూడకపోవడం దారుణమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే మండలంలో పలు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు క్షతగత్రులుగా మిగిలిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ అక్రమ మట్టి దందాలో అధికార బలంతో కరెన్సీ కట్టలతో రహదారిగా మార్చుకుని అధికారులకు కాసులు వర్షం కురిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ధనార్జినే ప్రధాన ధ్యేయంగా ఈ మాఫియా కొనసాగుతోంది. అధికారులు ఇటీవల పట్టుబడిన లారీలు, జెసిబి యంత్రాలను నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టి వదిలేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ఇటువంటి మట్టి మాఫియాపై ఉన్నతాధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుని ప్రజలు కోరుతున్నారు.

➡️