మాతృభాషను మరువకూడదు

Feb 21,2024 22:39
మాతృభాషను మరువకూడదు

ప్రజాశక్తి-తాళ్లపూడి, నల్లజర్లనేటి ఆధునిక సమాజంలో మనుగడ కోసం ప్రతి వ్యక్తి ఇతర భాషలపై ఆధారపడడం తప్పు కానప్పటికీ మాతృ భాష పరిరక్షణ కోసం కృషి చేయాలని తాళ్లపూడి మండల తహశీల్దారు కార్యాలయ గణాంక అధికారి జోడాల వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తహశీల్దారు కార్యాలయం వద్ద తెలుగు అక్షరమాల తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా జోడాల మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తనకు జన్మనిచ్చిన తల్లి ఒడిలో నుండి నేర్చుకున్న భాష మాతృభాష అవుతుందని, ఆ మాతృభాషను కాపాడుకుందాం, మాతృ భాషలోనే మాట్లాడదాం అని ప్రతిజ్ఞ చేయించారు. మండలంలోని బల్లిపాడు ప్రాథమిక పాఠశాలలో మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృభాష గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో శ్రీ సంఘమిత్ర విద్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం ప్రధానోపాధ్యాయులు గిరి కుమార్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులచే తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రథమ ,ద్వితీయ తతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం సంఘమిత్ర విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️