మోడీ హఠావో…దేశ్‌ బచావో…

Jan 29,2024 22:32
రాజ్యాంగ హక్కుల

15న రాజమహేంద్రవరంలో సదస్సు
భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక వెల్లడి
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి
మోడీ హఠావో-దేశ్‌ బచావో పేరున ఫిబ్రవరి 15న రాజమహేంద్రవరంలో సదస్సును నిర్వహిస్తున్నామని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు తెలిపారు. సోమవారం స్థానిక స్టేడియం వద్ద గల సిపిఐ కార్యాలయంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి టి.మధు, కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి హాజరై మాట్లాడారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెట్టి, రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసిన మోడీ, బిజెపి ప్రభుత్వాన్ని, దాని మద్దతు దారులను ఓడించాలని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పిలుపునిస్తుందన్నారు. త్యాగాలకు మారు పేరైన తెలుగు ప్రజలు మేల్కొని ఈ పోరులో చేయి, చేయి కలిపి ముందుకు నడవాలన్నారు. 5 కోట్ల తెలుగు ప్రజల మేలు కోసం అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి పదేళ్ల ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్యాకేజీ, ఢిల్లీని తలదన్నెలా రాజధాని నిర్మాణం చేస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ అనేక హామీలు ఇచ్చి, ఆనక వాటిని తుంగలో తొక్కారన్నారు. ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును కారు చౌకగా ప్రయి వేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకించాలన్నారు. యుపిఎ-1లో తిరుపతి ప్రాంతానికి వచ్చిన మన్నవరం బిహెచ్‌ఎల్‌ ప్రభుత్వ రంగ పరిశ్రమను బిజెపి అధికారంలోకొచ్చిన తర్వాత గుజరాత్‌కు తరలించారన్నారు. వేల కోట్లు విలువ చేసే సహజ వనరు గ్యాస్‌ను అంబానీకి అప్పగించి తెలుగు ప్రజలకు తీవ్ర ద్రోహం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా లక్షలాది గిరిజన కుటుంబాలను గోదారిలో ముంచుతున్నారన్నారు. సర్వమతాలు, అన్ని కులాలు, విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారత రాజ్యాంగం, దేశ సంపదను కొల్ల గొట్టుకుపోయిన బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టిన చరిత్ర మనకుందన్నారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని హరించి భారత రాజ్యాంగాన్నే మంటగలపాలని మతోన్మాద బిజెపి ప్రభుత్వం చూస్తుందన్నారు. కోటానుకోట్ల ప్రజానీకం కష్ట ఫలితంగా కూడబెట్టుకున్న దేశ సంపదను సంపన్నులకు దోచిపెడుతుంన్నారు.పక్కన ఉన్న కర్నాటకలో ఎద్దోళు కర్నాటక (మేలుకో కర్నాటక) పేరుతో అనేక మంది మేధావులు, సంఘాలు, సంస్థలు, పౌరులు ఏకమై బిజెపి, దాని మద్దతుదారులను మట్టి కరిపించార న్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో బిజెపి, దాని మద్దతుదార్లను ఓడించడానికి సాగే ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడిం చాలనే లక్ష్యంతో చేస్తున్న ఈ పోరాటంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, సిపిఎం సీనియర్‌ నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి పాల్గొన్నారు.

➡️