ఓట్ల లెక్కింపులో జాగ్రత్త వహించాలి

May 20,2024 22:11
ఓట్ల

ఆర్‌ఒలకు కలెక్టర్‌ మాధవీలత సూచన
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
సార్వత్రిక ఎన్నికలు -2024 ప్రక్రియలో భాగంగా ఓట్ల లెక్కింపులో అత్యంత జాగ్రత్త వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆర్‌ఒలకు సూచించారు. జూన్‌ 4న ఓటింగ్‌ లెక్కింపు వాస్తవ పరిస్థితిని గమనించి ఆమేరకు కౌంటింగ్‌ నిర్వహించే రోజున సిబ్బంది నియామకం చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్‌ కేంద్రాల్లోని మొబైల్‌ ఫోన్లు అనుమతించ రాదని ఆమె స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కౌంటింగ్‌ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్‌ అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ఏర్పాట్లు నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలు కచ్ఛితంగా పాటించాలని ఆదేశించారు. కౌంటింగ్‌ హల్లోకి మొబైల్‌ ఫోన్లను అనుమతి లేదన్నారు. ఆ మేరకు సంబందిత ఆర్వో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదని, ఇందుకోసం ప్రథాన ప్రవేశ ద్వారం దగ్గర నాలుగు ఎసి బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపునకు సంబంధించి కార్యాచరణను సిద్ధం చేసుకొని ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ సిబ్బంది తప్ప మిగతా ఎవ్వరినీ కౌంటింగ్‌ ప్రాంతంలోకి అనుమతించరాదన్నారు. రిటర్నింగ్‌ అధికారి మొబైల్‌ ఫోన్‌ మాత్రమే కౌంటింగ్‌ హాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని, వాటి ద్వారా రౌండ్‌ వారీగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారిక కమ్యూనికేషన్‌ విభాగంలో అధికారులకు, సిబ్బందికి సిట్టింగ్‌ ఏర్పాట్లు, ఎస్‌టిడి, ఫ్యాక్స్‌, ప్రింటర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాటు ప్రధాన ఎన్నికల అధికారికి తక్షణ సమాచారం కోసం హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కంప్యూటర్‌తో పాటు ఒక హాట్‌లైన్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వీటి పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారిని నియమించాలన్నారు. పరిశీలకుల గదిలో, ఫోన్‌, ఫ్యాక్స్‌, ఇంటర్నెట్‌, టీవీ, ప్రొటోకాల్‌ బృందం, సిబ్బంది అందుబాటులో ఉంచడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. మీడియా సెంటర్‌కు ప్రత్యేక హాల్‌, సహేతుకమైన సౌకర్యాలు, టెలిఫోన్‌, ఫ్యాక్స్‌, సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌, సీనియర్‌ ఆఫీసర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియ పరిశీలన కోసం ఎస్కార్ట్‌ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని, కేటాయించిన స్థలం వరకు తక్కువ వ్యవధి కోసం మాత్రమే అనుమతించాల్సి ఉంటుందన్నారు. మీడియా సెంటర్‌ వరకూ మొబైల్‌ ఫోన్‌లను అనుమతించవచ్చునని తెలియచేశారు. అభ్యర్థులకు అప్‌డేషన్‌ కోసం పబ్లిక్‌ కమ్యూనికేషన్‌ రూమ్‌ ప్రకటనల కోసం లౌడ్‌ స్పీకర్‌, కంప్యూటర్‌ సౌకర్యాలు, ఎక్స్‌ఎల్‌ షీట్‌, ఎంకోర్‌ సైట్‌లో సమాచారం క్రోడీకరించడానికి తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి టేబుల్‌ వద్ద స్టేషనరీ, ఇన్ఫర్మేషన్‌ షీట్లు, అదనపు సిబ్బంది కోసం ఏర్పాట్లు, మొబైల్‌ ఫోన్‌ల డిపాజిట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ ఏజెంట్స్‌కు నియామక ఉత్తర్వులు, టేబుల్‌ కేటాయింపులు కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. రౌండ్‌ వారీగా వివరాలు సంబంధిత రిటర్నింగ్‌ అధికారి డిజిగ్నిడేటెడ్‌ అధికారిని నియమించుకుని, వారీ ద్వారా మీడియా విభాగంకు సమాచారం అందివ్వాలన్నారు. భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో ఇవిఎంల రవాణా కోసం బారికేడ్‌లని ఏర్పాటు చేసుకోవడం, కౌంటింగ్‌ హాల్‌ వద్ద 100 మీటర్ల పాదచారుల జోన్‌ – బారికేడింగ్‌ – ప్రవేశ ద్వారం – మళ్లింపు కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. మూడు అంచెల భద్రత ఏర్పాట్లలో భాగంగా పాదచారుల జోన్‌లో మొదటిది, వ్యక్తిపై చూపబడిన ఐడి కార్డ్‌ను పరిశీలించి, సీనియర్‌ మేజిస్ట్రేట్‌ అనుమతిస్తారన్నారు. కౌంటింగ్‌ క్యాంపస్‌ రెండవ దశలో రాష్ట్ర సాయుధ పోలీసు ఫ్రిస్కింగ్‌,మహిళలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు, మొబైల్‌ ఫోన్‌లు లేవని నిర్ధారణ చేసుకోవాలన్నారు. మూడవ దశలో కేంద్ర ఆర్మ్డ్‌ పోలీస్‌ బలగాలు ద్వారా తనిఖీలకు ఏర్పాట్లు, కౌంటింగ్‌ హాల్‌ లోపల కెమెరా స్టాండ్‌ బదులు పాస్‌ హౌల్డర్ల హ్యాండ్‌హెల్డ్‌ కెమెరా అనుమతించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఏ మీడియా ప్రాంతం వరకు అనుమతించబడుతుందో గుర్తించడానికి ఆ గదిలో రెడ్‌ మార్క్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో కచ్ఛితత్వం పాటించాలని, శాంతియుత విధానంలో లెక్కింపు ప్రక్రియ నిర్వర్తించడం లో అందరూ సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని మాధవీలత పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్‌ అధికారి పైనే ఉంటుందన్నారు. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, ఎలక్షన్‌ ఏజెంట్లను లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో గరిష్ఠంగా 14 మంది ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారన్నారు. ఫారం-17 సి లో నమోదు చేసిన ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యతో సరిచూస్తారని, కౌంటింగ్‌ సిబ్బంది ఆ సంఖ్యను ఫారం 17 సి పార్ట్‌ 2 నోట్‌ చేసుకుని, దానిపై ఏజెంట్ల సంతకం తీసుకుంటారన్నారు. అనంతరం ఈవీఎంల సీల్‌ తొలగించి రిజల్ట్‌ బటన్‌ నొక్కుతారన్నారు. ఆ ఈవీఎంలో పోలైన ఓట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం తెలుస్తుందన్నారు. ఆ వివరాలను కౌంటింగ్‌ సిబ్బంది నోట్‌ చేసి, ఆ సంఖ్యను ఏజెంట్లు అందరికీ చూపించి, వారు సంతప్తి వ్యక్తం చేశాకే రౌండ్‌ ఫలితాలను వెల్లడించాలన్నారు. ఒక్కో రౌండ్‌ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది రాస్తారని, ఈ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీసి భద్రపరుస్తారని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కౌంటింగ్‌ ప్రక్రియ, ఏర్పాట్ల తదితరాలను వివరించారు. ఈ సమావేశంలో ఆర్‌ఒలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️