అమాత్యా.. సమస్యలివిగో..

Jun 15,2024 23:52
అమాత్యా.. సమస్యలివిగో..

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధిఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏళ్ళు తరబడి పరిష్కరించలేకపోతున్న నేతల తీరుని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సమయంలో హామీలను గుప్పిస్తున్నా ఆ తర్వాత పాలకులు వాటి ఊసెత్తడం లేదు. దీంతో దీర్ఘకాలికంగా సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక రంగాలు కుంటుపడ్డాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయాయి. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నా నిర్లక్ష్యం వెంటాడుతోంది. రైతాంగం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. పేద, సామాన్య వర్గాలు వైద్యం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ సమస్యలే. నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కీలక సమస్యలకు ఈ సారైనా పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. కొత్త పాలకులకు సమస్యలు సాదరంగా స్వాగతం పలుకుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సిఎంగానే కాక పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ జిల్లాలో కొన్ని కీలక సమస్యలు ప్రస్తావన ఆవశ్యకత ఎంతైనా ఉంది.పరిశ్రమలొస్తే ఉపాధి మార్గాలుకాకినాడ పరిసరాల్లో ఒఎన్‌జిసి ఆధ్వర్యంలో రిఫైనరీ ఏర్పాటు సహా పలు ఆయిల్‌ కంపెనీలు తీసుకొస్తామని కాకినాడ సెజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం 2006లో భూసేకరణ చేసింది. యూ.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో 10,500 ఎకరాల పరిధిలో కాకినాడ సెజ్‌ విస్తరించి ఉంది. వీటిలో 2,180 ఎకరాలను రైతుల పేరిట రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి విడతల వారీగా తిరిగి ఇచ్చేశారు. అప్పటి నుంచి మిగిలిన 8,320 ఎకరాల్లో పరిశ్రమలు రాకపోగా 18 ఏళ్లుగా భూములన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, కీలక శాఖలు నిర్వహిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పాడలో నిర్వహించిన సభలో కాకినాడ సెజ్‌ రైతులకు న్యాయం చేయడంతోపాటు ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఇచ్చిన హామీపై నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ పరిశ్రమలొస్తే అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు.ఆధునీకరిస్తేనే రైతులకు మేలుఏలేరు ఆయకట్టు కింద శివారు పంట పొలాలకు సాగునీటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏలేరు ఆధునీకరణ లేకపోవడంతో కాలువలు అధ్వానంగా మారిపోయాయి. దీంతో పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల శివారు రైతులకు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. వైసిపి పాలనలో ఆధునికీకరణకు రూ.139 కోట్లతో ధర్మవరం వద్ద శంకుస్థాపన చేశారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సిఎంగా ఉన్న సమయంలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేజ్‌-1, ఫేజ్‌-2లో రూ.394 కోట్ల నిధులతో అభివృద్ధి చేపడుతామని హామీ ఇచ్చినా నేటికి అమలు కాలేదు. మరోవైపు జిల్లాలో ప్రధాన పంట కాలువలు సైతం ఆధునీకరణకు నోచుకోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నూతన ప్రభుత్వం, జిల్లాకు చెందిన మంత్రి పవన్‌ ఈ ప్రధాన సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని రైతాంగం కోరుతోంది.కాకినాడ జిజిహెచ్‌లో సమస్యలు తిష్టప్రస్తుతం 1,165 పడకలు ఉన్న కాకినాడ జిజిహెచ్‌లో సమస్యలు నిత్యం రోగులను వేధిస్తున్నాయి. ఒకే మంచంపై ఇద్దురు, ముగ్గురు రోగులను ఉంచుతున్నారు. సరిపడా పడకలు లేకపోవడమే దీనికి కారణం. ప్రభుత్వం నుంచి వైద్య రంగానికి నిధుల విడుదలలో నిర్లక్ష్యం కారణంగా రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలు విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. కీలక వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. ముఖ్యమైన స్కానింగ్‌ల విషయంలో రిపోర్టులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో సరైన సమయానికి వైద్య సేవలు పొందలేకపోతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం జిజిహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాల్సి ఉంది.రహదారులు అధ్వానం మూడు జిల్లాల్లో 10,859 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులు (ఎన్‌హెచ్‌) 16, 216 ఆర్‌ అండ్‌ బి, పంచాయతీరాజ్‌ రహదారులు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో 3,060 కిలోమీటర్లు, తూర్పు గోదావరి జిల్లాలో 4,329, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 3,466 కిలోమీటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 1300 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు ఆయా శాఖల అధికారులు ఇప్పటికే గుర్తించారు. కొన్ని రోడ్లు బాగానే ఉన్నా ఎక్కువ వాహనాలు నడిచే రోడ్లు దారుణంగా మారాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల మరమ్మతులు గాని, నూతన నిర్మాణాలు గానీ చేపట్టకపోవడంతో పలువురి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వీటిని చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.ప్రమాదకరంగా తీరంకాకినాడ- ఉప్పాడ మధ్య తీర ప్రాంతం ప్రమాదకరంగా మారింది. ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడల్లా తీరం అతలాకుతలం అవుతోంది. 17 ఏళ్ల క్రితం ‘జియోట్యూబ్‌’ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన రక్షణ ఐదేళ్ల క్రితం పూర్తిగా ధ్వంసమయింది. సముద్ర కోత వల్ల కొన్నేళ్లుగా సుమారు 300 ఎకరాలు కోతకు గురైతే ఈ పాలకులు ఏం చేశారని ఎన్నికల ప్రచార సభలో పవన్‌ కళ్యాణ్‌ గత పాలకులను ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సముద్రపు కోత నివారణకు శాశ్వత పరిష్కార మార్గాలను చూపుతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో తీర ప్రాంత వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

➡️