గోపాలపురంలో గాలి వాన బీభత్సం

Jun 16,2024 22:55
గోపాలపురంలో గాలి వాన బీభత్సం

ప్రజాశక్తి-గోపాలపురం గోపాలపురంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలి వాన బీభత్సానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెట్లు విరిగి పడడంతో గోపాలపురం నుంచి జగన్నాథపురం వరకు సుమారు పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. పోలీస్‌ యంత్రాంగం గోపాలపురం శివారు నేషనల్‌ హైవే ఫ్యాక్టరీ వద్ద రోడ్డుకు అడ్డంగా పడిన 4 వృక్షాలను జెసిబి సాయంతో తొలగించారు. గంటకు పైగా వేలాది వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు భారీ వర్షంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విద్యుత్‌ శాఖ యంత్రాంగం విరిగి పడిన స్తంభాలను పునరుద్ధరించారు. సుమారు రెండు గంటలు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు, తాడిపూడి కాలువలో వరద నీరు భారీగా ప్రవహించింది. పిడుగుపాటుతో రెండు చూడి గేదెల మత్యువాత…గోపాలపురం బిసి కాలనీకి చెందిన రైతు మరీదు వెంకట దుర్గాప్రసాద్‌కు చెందిన రెండు చూడి గేదెలు పిడుగులు పడడంతో మృత్యువాత పడ్డాయి. రూ.1.60 లక్షల విలువైన ఆ గేదెలు మరొక పది రోజుల్లో దూడలను పెట్టేవని ఆయన కన్నీరు మున్నీరయ్యారు. గేదెలపైనే తాను జీవనోపాధి పొందుతున్నానని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

➡️