ఎన్నికల ప్రచార హోరు!

ఎన్నికల ప్రచార హోరు!

తరలివచ్చిన ప్రధాన పార్టీల అధినేతలు

సినీ, బుల్లితెర తారల తళుకుబెళుకులు

రంగంలోకి అభ్యర్థుల కుటుంబ సభ్యులు

సోషల్‌ మీడియా, డిజిటల్‌ వైపే మొగ్గు

అద్దెకు తెచ్చుకున్న వారితోనూ హడావిడి

ఇదే అదనుగా చోటానేతల చేతివాటం

ఓటర్లను ఎరవేసేందుకు ఏర్పాట్లు

ఐదేళ్ల అధికారమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని అస్త్రశస్త్రాలను బయటకు తీసి ప్రచార యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రచార గడువు సమీపిస్తుండడంతో చావో,రేవో అన్నంతగా సామబేధదాన దండోపాయాలను, ఆఖరి ఆస్త్రంగా ప్రలోభాల ఎరవేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సాంప్రదాయ ప్రచారంతోపాటు లోపాయికారీ ప్రచారానికి అపుడే తెరలేపాయి. ఈసారి అభ్యర్థుల కుటుంబసభ్యుల, ముఖ్యంగా మహిళలు రంగంలోకి ప్రధాన ప్రచారకర్తలుగా ముందుకు దూసుకెళ్తున్నారు. తారల తళుకుబెళుకు ప్రచారంతోపాటు సోషల్‌, డిజిటల్‌ మీడియాను అధికంగా వాడుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఉద్యమ పార్టీలు పాలకుల వైఫల్యాలు, సమస్యలే అజెండాగా ముందుకు సాగుతున్నాయి.

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ మరో ఆరురోజులలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల ప్రచారాలకు శనివారంతో ముగింపు. కేవలం నాలుగు రోజులే బహిరంగ ప్రచారాలకు అవకాశం ఉండడంతో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ తమ ప్రచారాలను ఉధృతం చేశారు. జిల్లాలోని ఏ నియోజకవర్గంలో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థులు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతోపాటు, వారికి మద్దతు తెలుపుతున్న నాయకులు, అలాగే అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీ, బిజీగా కనిపిస్తున్నారు. ప్రచారంలో అధిక సంఖ్యలో మహిళలు ఉండే విధంగా ప్రధాన పార్టీల నాయకులు ముఖ్యంగా, అధికార వైసిపి, కూటమి పార్టీలకు చెందిన టిడిపి, జనసేన వంటి పార్టీలు చూస్తున్నారు. వీరిలో అధిక శాతం మంది రోజుకు ఇంత అని తీసుకొని వస్తున్నవారే ఉన్నారన్నది బాహాటంగానే చెప్పుకుంటున్నారు. పెయిడ్‌ ప్రచారకర్తలను సమీకరించడం, వారిని ప్రచారంలో భాగస్వాములను చేయడం కోసం పార్టీలోని కొందరు చోటామోటా నాయకులు దోహదపడుతున్నారు. ఇదే అదునుగా అభ్యర్థుల నుంచి దండిగానే వసూళ్లు చేస్తున్నారు. ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ, ఎవరినైనా, ఏమైనా అంటే, ఎక్కడ ప్లేటు ఫిరాయిస్తారో, ఎలా రియాక్టవుతారో, ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని అభ్యర్థులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ జేబు డబ్బు మంచినీరులా ఖర్చు చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు సినిమా, బుల్లితెరల తారలను రంగంలో దించారు .టిడిపి, బిజెపి, జనసేన కూటమి తరపున ప్రచారంలో ఇటువంటివారు అధికంగా కనిపిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు, టిడిపి నాయకుడు బాలకృష్ణ ఇటీవల జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. బాలకృష్ణ చిన్న అల్లుడు ఎం శ్రీభరత్‌ విశాఖ పార్లమెంట్‌ స్థానంలో కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి కావడంతో, ఆయన తరుపున మరింత విస్తృతంగా బాలకృష్ణ ప్రచారం చేశారు. బిజెపికి చెందిన సినీ నటి నమిత, అలాగే బుల్లితెర నటులు ఇటు బిజెపి, అటు జనసేన తరపున నాలుగైదు రోజులుగా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. దీనికి భిన్నంగా ఇండియా బ్లాక్‌ బలపరిచిన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రజా సమస్యలను, ముఖ్యంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ, ఇంకా జిల్లాలోనిప్రధాన సమస్యలను, గత ప్రభుత్వాల వైఫల్యాలను ఓటర్లు దృష్టికి తీసుకువెళ్లి, ఇంటింటి ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరి ప్రచారానికి మంచి ఆదరణ లభిస్తుంది. పలువురు ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఎలక్ట్రానిక్‌ డిజిటల్‌ వాహనాలను ప్రత్యేకంగా తయారు చేయించి, ప్రచారంలో ఉపయోగిస్తున్నారు. ఇది కొత్తఒరవడి. ఇటువంటి వాహనాల నుంచి సంబంధిత పార్టీల అధ్యక్షులు ప్రసంగాలను సూక్ష్మంగా వివరించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. పత్రికలు, ప్రధాన ఎలక్ట్రానిక్‌ మీడియా వివిధ పార్టీలకు కొమ్ముకాస్తుండడంతో, ఒక మీడియాలో వచ్చే ప్రచార వార్తలు, మరో మీడియాలో కనిపించడం లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించి అభ్యర్థులు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందుకోసం ప్రత్యేక ప్రతినిధులను నియమించుకున్నారు కూడా. ఇప్పుడు అన్ని పార్టీలకు సోషల్‌ మీడియా పెద్ద ప్రచార వేదికగా దోహదపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న చిన్న సందులలో సైతం ఆటోలు తిరిగే ప్రాంతంలో పోటీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇదే సందర్భంలో, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, ప్రసన్నం చేసుకునేందుకు ఓటుకు ఇంత అని చెప్పి ఇచ్చేందుకు అభ్యర్థులు ఈసరికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. నేరుగా ఇంటింటికి వెళ్లి డబ్బు పంపిణీ చేయడం కంటే, పేటీఎం, గూగుల్‌ పే చెల్లింపులు చేసేందుకు కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

➡️