పేద మహిళకు రూ.44,718 విద్యుత్‌ బిల్‌

Apr 8,2024 21:31

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మండలంలోని కొండగుంపాంలో పేద మహిళకు రూ.44,718 విద్యుత్‌ బిల్లు రావడం దారుణమని సిపిఐ నాయకులు మొయిద పాపారావు తెలిపారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కొండగుంపాం గ్రామానికి చెందిన పేద మహిళ పతివాడ రాములమ్మకు ఈ నెల విద్యుత్‌ బిల్లు రూ. 44,718 వచ్చిందని తెలిపారు. వేలల్లో విద్యుత్‌ బిల్లు రావడంతో బాధితురాలు లబోదిబో మంటుందన్నారు. రాములమ్మ నెల పింఛన్‌తో జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వేల రూపాయల విద్యుత్‌ బిల్లు ఎలా కట్టగలదని ప్రశ్నించారు. కాగా విద్యుత్‌ బిల్లు విషయమై సచివాలయంలో తన కుమారుడు సంప్రదించగా సబ్‌ స్టేషన్‌కి వెళ్లి ఎఇని కలవమని చెప్పారని ఎఇని కలిసినప్పటికి లైన్‌ మెన్‌ వస్తారు చూస్తారని చెప్పి రోజులు తరబడి కార్యాలయం చుట్టూ తిప్పడం భావ్యం కాదన్నారు. ఇప్పటికైనా వేలల్లో వచ్చిన విద్యుత్‌ బిల్లు సరిచేసి బాధితురాలికి న్యాయం చేయాలని పాపారావు డిమాండ్‌ చేశారు.

➡️