అర్హులందరికీ ఇళ్ల పట్టాలు

ప్రజాశక్తి – భీమడోలు

వివిధ శాఖల సమన్వయం, సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కలను వైసిపి ప్రభుత్వం సాకారం చేసిందని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణంలో మంగళవారం సాయంత్రం నవరత్నాలు పేదలకు ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి ఇంటి స్థలం హక్కుల పత్రాన్ని ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్‌ అధ్యక్షులు కనమాల రామయ్య అధ్యక్షత వహించగా, ఎంఎల్‌ఎ మాట్లాడుతూ నవరత్నాల పథకంలో భాగంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రూ.17 కోట్ల వ్యయంతో 39 ఎకరాల భూసేకరణ జరిగిందన్నారు. దీనిలో భాగంగా 3,040 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ, స్థలాల గుర్తింపు కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. వీరిలో 2,543 మంది ఇంటి స్థలాల హక్కుల పత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో అన్ని అర్హతలు గల 2,136 మందికి లక్షలాది రూపాయల వ్యయంతో ఉచితంగా రిజిస్టర్‌ చేసిన హక్కు పత్రాలను అందజేశామన్నారు. మిగిలిన వారిలో వారికి కేటాయింపులో తలెత్తిన సమస్యలను పరిష్కరించి వారికి సైతం త్వరలోనే అందజేస్తామని వివరించారు. గతంలో డిఫారం రూపంలో ఇళ్ల స్థలాలుగా పట్టాలను అందజేసే వారన్నారు. వీటిపై సర్వహక్కులు వారికి అందేందుకు పలు ఇబ్బందులు ఏర్పడేవన్నారు. కానీ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియ అంతనూ సరళీకృతం చేసిందన్నారు. లబ్ధిదారునికి అన్ని సౌకర్యాల కల్పనతో పాటు విద్యుత్‌, నీరు, ఇతర సౌకర్యాలను ఉచితంగా కల్పించిందన్నారు. ఇంటి నిర్మాణానికి పూర్తిస్థాయి రాయితీతో కూడిన రుణాలను అందజేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యురాలు తుమ్మగుంట భవాని, భీమడోలు సర్పంచ్ల ఛాంబర్‌ అధ్యక్షురాలు పి.సునీత మాన్సింగ్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ ఐ.నీలిమ, వైసిపి ప్రముఖులు రావిపాటి సత్య శ్రీనివాస్‌, రామకుర్తి నాగేశ్వరరావు, ముళ్ళగిరి జాన్సన్‌ పాల్గొన్నారు.

➡️