‘ఉమ్మడి అభ్యర్థి ధర్మారాజుకు మద్దతుగా ఉంటాం’

ప్రజాశక్తి – భీమడోలు

ఉంగుటూరు నియోజకవర్గం నుంచి బిజెపి, టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.ధర్మరాజుకు టిడిపి సంపూర్ణ మద్దతు తెలియజేసింది. భీమడోలులోని టిడిపి కార్యాలయంలో గురువారం ఉదయం టిడిపి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన ఉంగుటూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న గన్ని వీరాంజనేయులు పొత్తులపై కార్యకర్తలతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వారందరూ తెలిపిన నిర్ణయం మేరకు ఉమ్మడి అభ్యర్థి ధర్మరాజుకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే ధర్మరాజు తనను కలిశారని, మద్దతు కోరారని చెప్పారు. పొత్తులో భాగంగా ఉంగుటూరు సీటును జనసేనకి చెందిన ధర్మరాజుకు కేటాయించారని, పొత్తు ధర్మంగా టిడిపి కార్యకర్తలు అందరూ ఆయనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపికి చెందిన ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️