జనభాగీదారిపై నేడు విద్యార్థులకు వక్తృత్వ పోటీలు

ప్రజాశక్తి – ఏలూరు

ఈనెల 10వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌మీడియట్‌, ఆపై చదువుతున్న విద్యార్థులకు, 26 సంవత్సరాల వయసు దాటిన యువకులకు వేరువేరుగా వక్తృత్వ పోటీలు నిర్వహించబడునని ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ తెలిపారు. జనవరి 19వ తేదీన విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తైన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ‘సామాజిక న్యాయ మహా శిల్పం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించనున్నారని ఆయన తెలిపారు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న పోటీల్లో నెగ్గిన విజేతలకు మొదటి బహుమతిగా రూ.3 వేలు, రెండో బహుమతిగా వెయ్యి రూపాయలు, వెలసి రూ.8 వేల నగదు, నగరపాలక సంస్థ కార్పొరేషన్‌ వారిచే ప్రశంసా పత్రం బహుకరించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, యువకులు ఈక్రింది అంశాలపై మాట్లాడేందుకు సమాయత్తం కావాలని కోరారు. ఆసక్తి గల వారు తమ పేర్లను ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ అండ్‌ మేనేజర్‌ పి.కృష్ణమూర్తికి ఈనెల 10వ తేది ఉదయం 10 గంటల లోపు అందజేసి నమోదు చేసుకోవాలన్నారు. ఇంటర్‌మీడియట్‌, ఆపై విద్యార్థులకు ఆర్థికవేత్తగా అంబేద్కర్‌, విద్యార్థినులకు సామాజిక ఉద్యమ కారునిగా అంబేద్కర్‌, యువకులకు అంబేద్కర్‌, కుల నిర్మూలన, యువతులకు అంబేద్కర్‌, రాజ్యాంగ నిర్మాణం అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. అదేవిధంగా 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించబడతాయన్నారు. విద్యార్థులకు అంబేద్కర్‌ ఆలోచనలు, విద్యార్థినులకు అంబేద్కర్‌ రచనలు, ముఖ్యాంశాలపై పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు.

భీమడోలు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ బోధనలు, సూచనలు అందరికి ఆచరణీయమని పొలసానిపల్లి గ్రామ సర్పంచి షేక్‌ రహీమా బేగం హసేన తెలిపారు. విజయవాడలో ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించనున్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సామాజిక న్యాయ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వేదికగా జన భాగీదారి పేర పలు అనుబంధ కార్యక్రమాలను నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు ఎ.దేవి నాగేంద్రప్రసాద్‌, ఉప సర్పంచి కోటా శ్రీనివాసరావు, గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్‌.ఠాగూర్‌ పాల్గొన్నారు. పొలసానపల్లి గ్రామం నుంచి మండల స్థాయిలో జరిగే క్రికెట్‌ పోటీలకు ఎంపికైన అనిల్‌ జట్టుకు సర్పంచి, ఎంపిటిసి సభ్యులు క్రికెట్‌ కిట్లు, టీ షర్ట్‌లు, టోపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.అనంతరం భీమడోలు గ్రామపంచాయతీ, రెవెన్యూ శాఖ పోలీస్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, ఇతర చట్ట విరుద్ద కార్యక్రమాలు చేపట్టకుండా అవగాహన సదస్సు నిర్వహించారు.

➡️