‘దాహార్తిని తీర్చండి’

ప్రజాశక్తి – భీమడోలు

దాహార్తిని తీర్చండి అంటూ పొలసానిపల్లి బిసి కాలనీవాసులు పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై స్పందించిన సర్పంచి సమస్య పరిష్కారానికి బాధ్యత వహిస్తూ తాత్కాలికంగా ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటీకీ, తమకు శాశ్వత పరిష్కారం మార్గం చూపాలని వారు వేడుకుంటున్నారు. వి వరాలలోనికి వెళ్తే దాదాపుగా మూడు దశాబ్దాల క్రితం అప్పట్లో నూతనంగా ఏర్పడిన బిసి కాలనీకి తాగునీటి సరఫరా కోసం పైపులైనును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో కాలనీ అభివృద్ధి చెందటం, రోడ్ల ఎత్తుపెరగటం, ఇతర కారణాలవల్ల అప్పట్లో వేసిన పైపులైన్‌ క్రింది భాగానికి చేరుకుంది. దీంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాలపై గ్రామ సర్పంచిని వివరణ కోరగా సమస్య పరిష్కారానికి బిసి కాలనీలో పైపులైను నూతనంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతస్థాయి బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు గ్రామీణ నీటి సరఫరా శాఖకు ప్రతిపాదన సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఈ విషయమై ప్రగతి తక్కువగా ఉంటంతో సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగతంగా ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. అనుమతితో పాటు నిధులు మంజూరుకాగానే నూతన పైపులైన్ల ఏర్పాటు చర్యలు తీసుకుంటామని సర్పంచి తెలిపారు.

➡️