నిర్లక్ష్యంగా వదిలేచిన బోరు బావి

హెచ్చరిక బోర్డులు పెట్టించిన సర్పంచి

ప్రజాశక్తి – ఉంగుటూరు

కొత్త ఉంగుటూరులోని జగనన్న ఇళ్ల స్థలాల లేఅవుట్‌ వద్ద నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రమాదకర బోరు బావిని స్థానికులు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. నారాయణపురంలో లబ్ధిదారులకు ఉంగుటూరు పంచాయతీలో భూసేకరణ చేసి మెరక చేసి ఇళ్ల స్థలాల కోసం ప్లాటుగా వేశారు. అట్టహాసంగా ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. జగనన్న కాలనీలో తాగునీటి బోరుకు అధికారిక అనుమతులు, నిధులు మంజూరు కాకుండానే ఓ గుత్తేదారుడు సుమారు 15 అంగుళాల వెడల్పు, 20 అడుగులకుపైగా లోతు వరకూ బోరుబావి కోసం డ్రిల్లింగ్‌ చేసి ఆపేసి వెళ్లిపోయాడు. అలా నిర్లక్షంగా వదిలేసిన బోరుబావిపై ఎలాంటి రక్షణ వలయం కాని, హెచ్చరిక బోర్డులు కాని పెట్టలేదు. అక్కడ ఆడుకునే పిల్లలు ఎవరైన అందులో పడిపోతే ప్రాణాలు పోవడం ఖాయమని ఆందోళన చెందిన స్థానికులు ఉంగుటూరు సర్పంచికి సమాచారం ఇచ్చారు. దీంతో సర్పంచి బండారు సింధుమధు వెంటనే బోరు బావిని సందర్శించి బావిపై అడ్డంగా రాళ్లుపెట్టి చుట్టూ ఎర్ర రిబ్బనుతో హెచ్చరిక ఉంచారు. సుమారుగా నాలుగు నెలల నుంచి బావి ఉంటున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా స్థానికుల ఫిర్యాదుతో పెను ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అస్సలు మాకు తెలియకుండా గుత్తేదారుడు బోరు బావి సగం నిర్మించి వదిలేసి వెళ్లిపోయినట్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ సిబ్బంది జాని వెల్లడించారు. బోరుబావి నిర్మించిన విషయం మా దృష్టికి రాలేదని తవ్వి వదిలేచిన బోరుబావిని పూడ్పించే చర్యలు తీసుకుంటామని హౌసింగ్‌ ఎఇ సురేష్‌బాబు ప్రజాశక్తికి వివరించారు. జల జీవన్‌ మిషన్‌లో అన్ని అనుమతులు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ద్వారానే జరుగుతాయని మా శాఖకు సంబంధం లేదని ఎఇ వివరించారు.

➡️