రూ.22 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

మండలంలోని తాటియాకులగూడెం అంతరాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద గూడ్స్‌ లారీ క్యాబిన్‌లో తరలిస్తున్న గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఇబి అడిషనల్‌ ఎస్‌పి నక్కా సూర్యచంద్రరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారు జామున ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద ఎస్‌ఇబి అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న గూడ్స్‌ లారీని ఆపి తనిఖీ చేయగా లారీ క్యాబిన్‌లో 11 గన్ని బ్యాగ్‌లలో 220 కేజీల గంజాయిను గుర్తించినట్లు తెలిపారు. గంజాయిని తూర్పుగోదావరి జిల్లా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారన్నారు. గంజాయి విలువ సుమారు రూ.22 లక్షల వరకు వుంటుందని తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, లారీను స్వాధీనం చేసుకుని జంగారెడ్డిగూడెం ఎస్‌ఇబి స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఇబి సిఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ మస్తనయ్య, సిబ్బంది ప్రవీణ్‌, శ్యామ్‌, విఆర్‌ఒ బుల్లబ్బులు, షరీఫ్‌ పాల్గొన్నారు.

➡️