విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ఆర్‌డిఒకు వినతి

జంగారెడ్డిగూడెం టౌన్‌ : విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించి, కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కార్యలయంలో ఏఒకి వినతిని అందించారు. లక్షల రూపాయలు కాంట్రాక్ట్‌ చేస్తూ విద్యార్థులకు నాసిరకం భోజనం అందిస్తూ వాళ్ల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి ఎం.వెంకట్రాజు అధ్యక్షత వహించగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్స్‌కు, ఏజెన్సీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు కూరగాయలు, గుడ్లు, చికెన్‌, నాణ్యతలేని సరుకులు అందిస్తున్న జంగారెడ్డిగూడెంకి చెందిన కూరగాయల కాంట్రాక్టర్‌ పెనుమత్స రాజుపై చర్యలు తీసుకోవాలన్నారు. జీలుగుమిల్లి మండలం ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థులకు రెండు రోజులు నిల్వ ఉంచిన చికెన్‌తో కూర వండి పెట్టిన కారణంగా మరుసటి రోజు ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు అవటంతో హాస్పిటల్‌లో వారం రోజులు పాటు వైద్యం చేయించుకుని బయటపడటం జరిగిందన్నారు. దీనికి కారణం హాస్టల్స్‌కు నిత్యం కూరగాయలు, కోడిగుడ్లు, చికెన్‌, నిత్యావసర సరుకులు అన్ని నాణ్యతలేనివి అందించడం వల్లనే అన్నారు. నాణ్యమైన సరుకులు లేనప్పుడు ప్రశ్నించకుండా కాంట్రాక్టుదారులతో కుమ్మక్కై అలాంటి విషపూరిత ఆహారాలను వండి పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయానా డిఎంహెచ్‌ఒ తనిఖీ చేసి నిల్వ ఉంచిన సరుకులు, కూరగాయలతో వండటంతో ఇలాగే ఫుడ్‌ పాయిజన్‌ అవుతున్నాయని తేల్చారు. కనుక ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన సరుకులు అందించని కాంట్రాక్టర్‌ పెనుమత్స రాజు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని, కాంట్రాక్టును రద్దు చేయాలని అన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులను డిమాండ్‌ చేశారు.

➡️