ఉత్సాహపరిచిన కోయ నృత్యం.. సందేశాత్మక కళా రూపం..

Apr 26,2024 00:34

ప్రజాశక్తి-తాడేపల్లి : ఇండియా వేదిక బలపరిచిన మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం రాత్రి ఉండవల్లి సెంటర్‌లోని జామాయిల్‌ తోట నుంచి తాడేపల్లి వరకు సాగిన వివిధ కళా ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. కోయ నృత్యాలు… డప్పుల దరువులు… ప్రజా నాట్యమండలి కళారూపాలతో ఉండవల్లి సెంటర్‌, తాడేపల్లి దద్దరిల్లాయి. దారి పొడవునా ప్రజలు ఆసక్తిగా ఈ ప్రదర్శనను తిలకించారు. బిజెపి, టిడిపి, వైసిపి, జనసేన పార్టీల స్వార్థ రాజకీయాలను ఎండగడుతూ ప్రజానాట్య మండలి కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతులు పద్మనాభరెడ్డి, కోటిరెడ్డి రైస్‌ మిల్లు వద్ద శిశంకరరావుకు స్వాగతం పలికి ఆయన పాటు కలిసి నడిచారు. ప్రదర్శన ప్రారంభంలో సినీనటుడు, దర్శకులు గాదె నాగభూషణం తన కుటుంబంతో పాటు అభ్యర్థికి తిలకం దిద్ది హారతులిచ్చారు. దారి పొడవునా మహిళలు స్వాగతం చెప్పి సిపిఎం అభ్యర్థికి మద్దతు పలికారు. తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌లో విశ్రాంత లెక్చరర్‌ పలగాని గాంధీ, వ్యాపారవేత్త పలగాని నాగేశ్వరరావు, లక్ష్మణ, నాగబాబు, రామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. సిపిఎం అభ్యర్థి ఓట్లు అభ్యర్థిస్తూ సాగిన ఈ ప్రదర్శన తాడేపల్లి పట్టణంలోని నెహ్రు బొమ్మ సెంటర్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా ఉండవల్లి సెంటర్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, నెహ్రుబొమ్మ సెంటర్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడు నల్లచట్టాలను తెచ్చి రైతుల ఉసురు తీసిందన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా రైతుల పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రైతులతోపాటు ఏ రంగంలోని ప్రజలూ సంతోషంగా లేరని చెప్పారు. కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్పు చేసి నిర్వీర్యం చేశారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవంలభిస్తున్న బిజెపిని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పాపం బిజెపితో పాటు వైసిపి, టిడిపిదేనన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన బిజెపితో రాష్ట్రంలోని మూడు పార్టీలు ఎందుకు అంటకాగుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడేపల్లిలో కార్పొరేషన్‌ పన్నులు విపరీతంగా పెంచారని, ఇళ్ల నిర్మాణానికి సిఆర్‌డిఎ పెడుతున్న నిబంధనలు ఇబ్బందికరంగా మారాయని చెప్పారు. ఇండియా వేదిక అభ్యర్థులను ఆదరించాలని, ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, తాడేపల్లి రూరల్‌, పట్టణ కార్యదర్శులు డి.వెంకటరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, నాయకులు డి.శ్రీనివాసకుమారి, కె.కరుణాకరరావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు గాదె సుబ్బారెడ్డి, సిపిఐ నాయకులు టి.వెంకటయ్య పాల్గొన్నారు.

➡️