ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి

Apr 8,2024 00:18

బైక్‌ ర్యాలీలో కలెక్టర్‌, జెసి తదితరులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వచ్చేనెల 13న జరగనున్న పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పల్నాడు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎల్‌.శివశంకర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద నుండి పల్నాడు రోడ్డులో గల ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల వరకు ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేట నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, స్వీప్‌ నోడల్‌ అధికారి నాగిని పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బైక్‌ ర్యాలీని కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బైక్‌లు నడుపుతూ వారూ ర్యాలీలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఓటర్‌ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ అర్హులైన అందరినీ ఓటర్‌గా నమోదు చేస్తున్నామని చెప్పారు. పోలింగ్‌ రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో ఆయా ఓటర్‌లకు అందుబాటులోనే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. మన హక్కులకు భంగం కలిగితే ఎలా ప్రశ్నిస్తామో అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ మే 13న ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకొవడానికి గానూ ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నామని, అందులో భాగంగానే కేంద్ర బలగాలు ఆధ్వర్యంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద, గత ఎన్నికలలో ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలిస్‌ కవాతు ప్రదర్శన నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజలు భయమేమీ లేకుండా నిర్భయంగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు తోపాటు గట్టి నిఘా ఉంచామని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. డబ్బు, మద్యం, తదితర వాటినీ సీజ్‌ చేస్తున్నామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ ఓటర్‌ నమోదు అవగాహన (స్వీప్‌ యాక్టివిటీ ) కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్య పరుస్తున్నామన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు మేరకు మే 13న పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతయుతంగా మెలిగి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

➡️