ఓటుహక్కును వినియోగించుకోవాలి

Apr 5,2024 22:36
ఫొటో : మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.హరినాయణన్‌

ఫొటో : మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.హరినాయణన్‌
ఓటుహక్కును వినియోగించుకోవాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ (చేజర్ల) : భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవడం ప్రతిఒక్కరీ బాధ్యత అని, దానిని గుర్తెరగాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం చేజర్ల మండలంలో కలెక్టర్‌ పర్యటించారు. చేజర్ల ఎస్‌టి కాలనీలో నిర్వహించిన ఓటర్ల చైతన్యపరిచే కార్యక్రమం (స్వీప్‌)లో పాల్గొని గిరిజనులకు ఓటుహక్కు ప్రాధాన్యత, వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పౌరులందరికీ ఓటుహక్కు ఒకేసారి కల్పించబడలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంబేద్కర్‌ ప్రజలందరికీ అందించిన రాజ్యాంగంలో కుల మతాలకు అతీతంగా 18యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినట్లు తెలిపారు. ఎంతోమంది త్యాగధనుల ఫలితంగా లభించిన స్వాతంత్య్ర భారతావనిలో రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప ఆయుధం ఓటు అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవడం కనీస బాధ్యతగా భావించాలన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో వెనుకబడిన ప్రాంతాల్లో ఓటర్లను చైతన్యపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. బూత్‌లెవల్‌ అధికారులు ప్రతి ఇంటికి వచ్చి పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలుపుతారని, ఓటరు స్లిప్‌ అందజేస్తారని తెలిపారు. ఎండవేడిమి నుంచి ఇబ్బందులు లేకుండా టెంట్లు, కుర్చీలు, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే ఇంకా ఓటరుగా నమోదు కాని 18 సంవత్సరాలు నిండిన వారు 14లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ తమ విలువైన ఓటును స్వేచ్ఛగా, నిజాయితీగా, నిర్భయంగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్‌డిఒ కె.మధులత తదితరులున్నారు.బోడిపాడు గ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలో తనిఖీచేజర్ల మండలం బోడిపాడు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. పోలింగ్‌ కేంద్రంలో గతంలో జరిగిన సంఘటనలు, చేపట్టిన, చేపట్టాల్సిన ఏర్పాట్లపై రిటర్నింగ్‌ అధికారి మధులతను అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక కేంద్రాల పరిధిలోని ఓటర్లందరూ భయం లేకుండా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించారు. అనంతరం ఓటర్లతో మాట్లాడి వారి ఓటు ఎక్కడ ఉంది, గతంలో ఎక్కడ వేశారు మొదలైన వివరాలను అడిగి తెలుసుకుని, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకోవాలని వారికి సూచించారు. కలెక్టర్‌వెంట ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి మధులత, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌, తహశీల్దార్‌, ఎమ్‌డిఒ, స్థానిక అధికారులు, బిఎల్‌ఒలు ఉన్నారు.

➡️