ఎండమావిగా ఉచిత విద్య

May 26,2024 23:34

ప్రజాశక్తి – పెదకూరపాడు : ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించి వారికి చదువు చెప్పాలని, అందుకయ్యే ఖర్చును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం చెల్లిస్తుందని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ చట్టం వచ్చి 14 ఏళ్లయినా ప్రైవేలు, కార్పొరేట్‌ విద్యాస్థల్లో ఒక్కదానిలో అయినా సరిగా అమలు కావడం లేదు. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2009లో విద్యాహక్కు చట్టాన్ని ప్రవేశపెట్టింది. 2010లో ఈ చట్టం అమలులోకి వచ్చింది. 14 ఏళ్లలోపు వారికి ఉచిత నిర్బంధ విద్య ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ప్రతి కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలో 25 శాతం అడ్మిషన్లు పేదలకు ఉచితంగా కేటాయించాలి. పేద విద్యార్థుల నుంచి గాని తల్లిదండ్రుల నుంచి గాని ఎలాంటి ఫీజులూ వసూలు చేయకూడదు, దారిద్య్రరేఖ దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓటీల్లో పేదలకు చట్టప్రకారం కేటాయించాలి. అడ్మిషన్ల సమయంలో పాఠశాలలకు వచ్చిన దరఖాస్తుల్లో 25 శాతాన్ని విభజించాలి. వారిలో 5 శాతం సీట్లు అనాథ బాలలకు, హెచ్‌ఐవి బాధితులకు కేటాయించాలి. 10 శాతం సీట్లు ఎస్సీలకు, నాలుగు శాతం సీట్లు ఎస్టీలకు, 6 శాతం బీసీలకు, ఓసీల్లో రూ.60 వేలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి కేటాయించాలని చట్టం చెపుతోంది.ప్రైవేటు పాఠశాలలకు అనుకూలంగా ఉండే విధంగా ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల కోసం మార్చిలో దరఖాస్తులను విద్య హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాలని నిబంధన చేర్చారు. ఆ సమయంలో విద్యార్థులు ఏదోఒక పాఠశాలలో చదువుతూ ఉంటారు. పరీక్ష సమయం కావడంతో ఆ పనిలో విద్యార్థులు తల్లిదండ్రులు నిమగమై ఉంటారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విషయం ఎక్కువ మందికి అవగాహన లేదు. అట్లా అడ్మిషన్లు వచ్చిన వారు కూడా ప్రభుత్వం ఇచ్చే ఫీజులు పాఠశాలలకు చెల్లించవలసి ఉంది. పెదకూరపాడు మండలంలో ప్రైవేటు పాఠశాలలు ఐదారుండగా వీటిల్లో ఒక్కో పాఠశాలలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే అడ్మిషన్లు పొందగలుగుతున్నారు. తాజాగా అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారి సంఖ్యకూడా చాలా పరిమితమే.ఆదాయమే పరమావధిగా ప్రైవేటు, కార్పొరేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో పాఠశాలలు పుట్టగొడుగుల వెలుస్తున్నాయి. వాటిల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొన్ని పాఠశాలలకు ఆట స్థలాలు ఉండవు, గాలి, వెలుతురు సోకని గదులలో పిల్లలను కుక్కి పాఠాలు బోధిస్తున్నారు. ప్రైవేటు కార్పొరేట్‌ విద్యాసంస్థల నిర్వాహకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ పార్టీల అండదండలు ఉండడంతో విద్యాశాఖ అధికారులు కూడా చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై పెదకూరపాడు మండల విద్యాశాఖ అధికారి సత్యన్నారాయణను వివరణ కోరగా మార్చిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి ఉచితంగా సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు.

➡️