రైల్వే లైన్ల నిర్మణం, కొత్త రైళ్ల కోసం నిధులు కేటాయించాలి : సిపిఎం

Jan 30,2024 17:55 #cpm dharna, #Kurnool, #railway station

ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : కర్నూల్ జిల్లాలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కొరకు, కర్నూలు జిల్లా కేంద్రం నుండి అదనపు రైళ్ల ఏర్పాటు కొరకు 2024-25 సంవత్సరపు బడ్జెట్లో నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీ నిర్మల కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాకు అదనపు రైళ్ల కోసం, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
సిపిఎం నగర కార్యదర్శి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. కర్నూల్ నగరం ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని అయినప్పటికీ నేటికీ నగరం నుండి వివిధ ప్రాంతాలకు రైళ్ల సౌకర్యాలు లేవని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నగర ప్రజలు రెగ్యులర్ గా రాజధానికి వెళ్లడానికి రైలు లేకపోతే సిపిఎం పార్టీ ఇతర పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం వల్ల కర్నూల్ నుండి హైదరాబాద్ కు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ను ఏర్పాటు చేశారు కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని కి వెళ్లడానికి ఎటువంటి సౌకర్యం లేదాని వారు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అయినప్పటికీ నేటికీ కూడా ఒక్క రైలు కూడా కర్నూల్ నుండి విజయవాడకు లేకపోవడం నగర ప్రజల దౌర్భాగ్య పరిస్థితిని సూచిస్తోంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం గానీ నేడున్న ప్రభుత్వం గానీ, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు కానీ రైలు వేయించడం కొరకు ప్రయత్నం చేయకపోవడం ప్రభుత్వాలు, ప్రజాప్రతితుల చేతకానితనానికి నిదర్శనమని వారు ఘాటుగా విమర్శించారు. బిజెపి కూడా కేంద్రంలో తామే అధికారంలో ఉన్నప్పటికీ కర్నూలు జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు రైళ్లు వేయించకపోవడం కర్నూలు జిల్లా ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏదో స్పష్టమవుతున్నదని వారు తెలిపారు. గతంలో ఉన్న మచిలీపట్నం ట్రైన్ కూడా రద్దు చేసినా అడిగే నాథుడే లేడని వారు తెలిపారు. కాచిగూడ – గుంటూరు రైలు ను విజయవాడ వరకు పొడిగించలేకపోవడం రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు తెలిపారు. పంచలింగాల దగ్గర రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ నిర్మాణం నత్తనడకగా సాగుతున్నదని, దానికోసం నిధులు రాబట్టడంలో అధికారులు ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారని వారు విమర్శించారు.  రైల్వే వ్యాగన్ వర్క్ షాపు తర్తాగతిన పూర్తి చేయడం కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే విజయవాడ విశాఖపట్నం కాకినాడకు రెగ్యులర్ గా ట్రై న్లు నడపాలని, కర్నూలు విజయవాడ మధ్య ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును ఏర్పాటు చేయాలని, రద్దు చేసిన మచిలీపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ను పునరుద్ధరించి రోజువారీగా నడపాలని, అలాగే కర్నూల్ నుండి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నం కు వెళ్లే రైలును రెగ్యులర్ ట్రైన్ గా మార్చాలని, కర్నూల్ నుండి బాంబే కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని, ప్రతి రైలులో 6 జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని, కర్నూల్ నుండి మంత్రాలయం, కర్నూల్ నుండి శ్రీశైలం, కర్నూల్ నుండి ఓర్వకల్ మీదుగా నంద్యాల వరకు కొత్త రైల్వే లైన్ల నిధులు కేటాయించాలని, అలాగే జర్నలిస్టులకు, సీనియర్ సిటిజనులకు, విద్యార్థులకు, వికలాంగులకు, రద్దు చేసిన రాయితీలను పునరుద్ధరించాలని వారు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ధర్నా అనంతరం స్టేషన్ మేనేజర్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రాధాకృష్ణ, నారాయణ, రాముడు, నగేష్, నగర నాయకులు నరసింహులు, ప్రభాకర్, అబ్దుల్లా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️