ఎస్‌.కోట కాంగ్రెస్‌ అభ్యర్థిగా గేదెల

Apr 23,2024 21:49

 ప్రజాశక్తి – శృంగవరపుకోట, జామి : ప్రముఖ వైద్యులు తిరుపతి కాంగ్రెస్‌ అభ్యర్థిగా శృంగవరపుకోట బరిలో నిలువనున్నారు. ఈ మేరకు మంగళవారం పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బి-ఫారం అందజేసి, లైన్‌ క్లియర్‌ చేశారు. తొలి నుంచి శృంగవరపుకోట కాంగ్రెస్‌ అభ్యర్థి స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. అయితే గడి బంగారు నాయుడు చివరి వరకూ పోటీ పడ్డారు. కానీ చివరికి గేదెలను టికెట్‌ వరించింది. గేదెల తొలి నుంచీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులు. జామి, గంట్యాడ, కొత్తవలస మండలాల్లో బంధుత్వాలు మెండుగా ఉన్న వ్యక్తి. తన తండ్రి గేదెల సన్నిబాబు జ్ఞాపకార్థం పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న వ్యక్తిగా అందరికీ చేరువయ్యారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్‌ తిరుపతిరావును శృంగవరపుకోట అభ్యర్థిగా పోటీకి అవకాశం కల్పించడం సమంజసమేనని నియోజకవర్గ ప్రజలు హర్షిస్తున్నారు.ఇండియా వేదిక అభ్యర్థిగా మేధావుల మద్దతు కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల చేరిన తరుణంలో ఆ పార్టీ పుంజుకుంటున్న తరుణంలో గేదెలకు టికెట్‌ ఇవ్వడంతోపాటు ఇండియా వేదికలో ఉన్న సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాల మద్దతుగా మెండుగా ఉంది. మేధావులు, యువత, మైనారీలు మద్దతు పలికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో అటు టిడిపి, వైసిపిలు గేదెల పోటీపై ఆందోళన చెందుతున్నాయి.

➡️