15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి తాగునీరివ్వలేకపోయారు

మాచర్ల: స్థానిక శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి మంచి సాన్ని హిత్యం వుందని, అయినా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోలేక పోయారని, నాలుగు సార్లు ఎమ్యెల్యేగా గెలిచి కనీసం మాచర్ల పట్టణానికి తాగునీరు ఇవ్వలేకపోయారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు విమర్శించారు. ఆదివారం స్థానిక స్థానిక సిపిఐ కొమెర వీర స్వామి భవనంలో మాచర్ల నియోజకవర్గం జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాదరావు, సహాయ కార్యదర్శులు షేక్‌ హుస్సేన్‌, కాసారాంబాబు, ఏరియా సెక్రటరీ మేకపోతుల శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముప్పాళ్ళ నాగే శ్వరరావు మాట్లాడుతూ పల్నాడు మెరకప్రాంత రైతుల కష్టాలు తీరాలంటే వరికపూడిసెల ఎత్తిపోతుల పథకం పూర్తి కావాలన్నారు. ఇప్పకికే ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారన్నారు. వరికపూడిసెల ఎత్తిపోతల నిర్మాణం కోసం 2007లో సిపిఐ ఆధ్వర్యంలో నియోజవర్గం మొత్తం నేను పాదయాత్ర చేసి మాచర్ల పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. తరువాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకానికి శంఖస్థాన చేశారని, అంతకు ముందు చంద్రబాబునాయుడు కూడా శంకుస్థాపన చేశారన్నారు. ప్రస్తుత జగన్‌ ప్రభుత్వంలో కూడా ఈ ప్రాజెక్టు పూర్తిచేయలేక పోయారన్నారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని ఇండియా వేదిక తరపున పోటీకి సిద్ధమైన అభ్యర్థులను బలపరచటం, నియోజకవర్గంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించామని, ‘ఇండియా’ అభ్యర్థి డాక్టర్‌ వై.రామచంద్రారెడ్డిని బలపరిచినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రామచంద్రరెడ్డి, సిపిఐ నాయకులను కలసి చర్చించారు. సమావేశంలో మాచర్ల, రెంటచింతల, దుర్గి, కారంపూడి మండల సెక్రటరీలు మిద్దె పోగు బాబురావు, కేతావత్‌ నాయకులు, కాలా శివయ్య, షేక్‌ సైదా పాల్గొన్నారు.

➡️