హైటెక్‌ ప్రచారం

Apr 15,2024 21:55

ప్రజాశక్తి-చీపురుపల్లి : ఎన్నికల ప్రచార శైలి రోజు రోజుకూ మారుతోంది. ఆధునిక పోకడలకు తోడు నాయకులు తమ పంథాను మార్చుకుంటున్నారు. మూస ప్రచారానికి స్వస్తి చెప్పి అధునాతన సాంకేతికతను అభ్యర్ధులు వినియోగించుకుంటున్నారు. ఓటరకు దగ్గరయ్యే ప్రయాత్నాన్ని అభ్యర్థులు చేస్తున్నారు. ఒకప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గోడలపై చేతి రాతలు, బ్యానర్లు వంటి వాటితో ప్రచారం నిర్వహించిన నాయకులు రానురాను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రచార శైలి మారింది. ఆటోలు, జీపులకు మైక్‌లు కట్టి ప్రచారం చేసేవారు. అది కూడా నేడు మారిపోయి వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్రసార సాధనాలను వినియోగిస్తూ అభ్యర్థులు తమ ప్రచారం ఉద్దేశాన్ని క్షణాల్లో ఓటరకు చేరవేస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మాట్లాడుతూ మరొక ప్రాంతంలో ఉన్న ప్రజలకు తమ ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఎల్‌ఇడి స్రీన్‌లను వాడుతూ అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షిస్తున్నారు. దీని ద్వారా వారి సమయం కూడా ఆదా అవుతుందనే ఆలోచనకు నాయకులు వచ్చారు. అభ్యర్థులు ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు బుర్రకథలను ఏర్పాటు చేసి గత పాలకులు చేసిన తప్పులను, వైఫల్యాలను, తాము అధికారంలోకి వస్తే చేసే పనులు తాలూకా వివరాలను ప్రజలకు పాటల ద్వారా వినిపించేవారు. కాని ఇప్పుడు ఆ సంస్కృతి కనుమరుగైంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఎన్నికల హామీలను వస్త్రంతో తయారు చేసిన బ్యానర్లు, గోడలపై రాతలతో రాసి ప్రచారం నిర్వహించేవారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించనున్న హామీలను బ్యానర్లపై ముద్రించేవారు. ఎండ్ల బండ్లపై బహిరంగ సభలకు ప్రజలను తరలించే వారు. అంతే గాకుండా రిక్షాలకు, ఆటోలకు మైకులు ఏర్పాటుచేసి ఊరూరా తిరుగుతూ అభ్యర్ధుల గెలునకు సహకరించాలని ఓటర్లను కోరే వారు. కానీ అవేమీ నేడు లేక పోవడంతో బ్యానర్లు తయారు చేసేవారు, గోడపై రాతలు రాసేవారు, రిక్షాలలో ప్రచారం చేసేవారు, మైకులలో అభ్యర్ధుల గురుంచి ప్రచారం చేసేవారంతా ఉపాధి కోల్పోయారు.వినూత్న పద్దతులతో ప్రచారానికి శ్రీకారం పాత పద్దతులను పక్కన పెట్టిన అభ్యర్థులు ప్రచారంలో వినూత్న పద్దతులకు శ్రీకారం చుడుతున్నారు. హద్దు మీరి సోషల్‌ మీడియాను అభ్యర్ధులు వాడుతున్నారు. ప్రస్తుతం ప్రతీ ఇంటిలో ప్రతీ ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తుండడంతో సోసల్‌ మీడియాను ప్రధానాస్త్రంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు సోషల్‌ మీడియాలో అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌ వంటి ప్రచార మాధ్యమాల ద్వారా కొంత మందిని నియమించుకొని తమకు అనుకూల రీతిలో ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నేడు అ పరిస్థితిలేదు. బారీ మోటారు వాహనాల ద్వారా పెద్ద ఎత్తున జరిగే సభలకు ప్రజలను తరలిస్తున్నారు. మరోవైపు ఎల్‌ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేసి సభ ఉద్దేశాన్ని బలంగా చాటే విధంగా అభ్యర్థులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు హైడ్రోజన్‌ బెలూన్లను గాల్లోకి వదులుతూ ప్రత్యర్దులకు తాము అందనంత ఎత్తులో ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రచారం రాబోయే రోజుల్లో ఏ స్థాయి చేరుతుందో వేచి చూడాల్సిందే.

➡️