నిఘా పెంచండి

Apr 8,2024 21:21

సీజర్స్‌పై దృష్టి సారించాలి

జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం  : ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు లావాదేవీలు, రవాణా జరగకుండా నిఘా పెంచాలని వివిధ శాఖల జిల్లా అధికారులను, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. సీజర్స్‌ పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. జిల్లా స్థాయి విజిలెన్స్‌, ఇఎస్‌ఎంఎస్‌ (ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) నోడల్‌ ఆఫీసర్ల సమావేశాన్ని కలెక్టర్‌ తన ఛాంబర్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల్లో అన్ని రకాల ప్రలోభాలను అరికట్టడానికి నిఘా పెంచాలని ఆదేశించారు. నగదు, మద్యం, వివిధ రకాల పరికరాలు, వస్తువులు, వస్త్రాలు, ఆభరణాల అక్రమ రవాణాపై దృష్టిపెట్టాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, పరికరాలు, వస్తువులను సీజ్‌ చేయాలని ఆదేశించారు. గత ఎన్నికలతో పోలిస్తే, జిల్లాలో ఇప్పటివరకు జరిగిన సీజర్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.17.84 లక్షల నగదు, 29,148 లీటర్ల మద్యం, రూ.29.35 లక్షల విలువైన డ్రగ్స్‌, రూ.10.38 లక్షల విలువైన లోహపరికరాలు,రూ.31.01 లక్షల విలువైన వివిధ రకాల వస్తు సామగ్రి కలిపి మొత్తం సుమారుగా రూ.1,17,32,501 విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేయాలని, నిఘాను విస్తతం చేయాలని ఆదేశించారు. ఆర్‌పిఎఫ్‌, జిఆర్‌పి సిబ్బంది కూడా అప్రమత్తం కావాలని సూచించారు. ముఖ్యంగా మద్యం విక్రయాలు, అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని సూచించారు. మద్యం విక్రయాలు పెరిగిన చోట, కారణాలను ఆరా తీయాలన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ క్రియాశీలం కావాల్సిన అవసరం ఉందన్నారు. భారీ నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దృష్టి సారించాలని సూచించారు.సమావేశంలో జిల్లా ఎస్‌పి దీపిక, జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, నోడల్‌ ఆఫీసర్లు ఎఎస్‌పి అస్మా పర్హీన్‌, సిపిఒ పి.బాలాజీ, ఎక్స్‌పెండిచర్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సత్యప్రసాద్‌, జిల్లా ఆడిట్‌ ఆఫీసర్‌ అరుణకుమారి, జెడ్‌పి సిఇఒ కె.శ్రీధర్‌రాజా, ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ ఎన్‌వి రమణ, ఎస్‌ఇబి అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ డివిజి రాజు, సిజిఎస్‌టి సూపరింటిండెంట్‌ ఎఎస్‌ఎల్‌ శర్మ, ఎస్‌జిఎస్‌టి సూపరింటిండెంట్‌ పిబి వల్లి, ఎల్‌డిఎం వైడి ప్రత్యూష, ఎఫ్‌ఆర్‌ఓ బి.అప్పలరాజు, ఇన్‌కమ్‌టేక్స్‌ అధికారి జెవి రమణ, ఎలక్షన్‌ సూపరింటిండెంట్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️