రాజాంలో గెలుపెవరిది?

May 3,2024 21:41

ప్రజాశక్తి- రేగిడి: రాజాం నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌తో పాటు మరో ఏడు పార్టీలు పోటీలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టిడిపి, వైసిపి పార్టీల మధ్య ప్రధాన పోటీగా ఉంది. వీరి తరువాత స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారాల్లోనూ టిడిపి, వైసిపి పార్టీలే కీలకంగా మారాయి. ఎత్తుకు పై ఎత్తివేసి ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. గ్రామాల వారీగా ముందుగా చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న బిఎస్‌పితో పాటు మిగతా ఇండిపెండెంట్‌ అభ్యర్థుల పాత్ర ఈ ఎన్నికల్లో నామమాత్రంగానే ఉండనుంది. టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌, బిఎస్‌పి ఎమ్మెల్యే అభ్యర్థులు నలుగురుతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థుల్లో కొంతమంది విద్యావంతులే ఉన్నారు. 2009లో రాజాం నియోజకవర్గం ఎస్‌సి రిజర్వేషన్‌ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో లావేరు మండలంల లావేటిపాలెం గ్రామానికి చెందిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీ, పాలకొండకు చెందిన తలే భద్రయ్య కుమారుడు తలే రాజేష్‌ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. పాలకొండ మండలం చిన్న మంగళాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కంబాల రాజరత్నం కుమారుడు కంబాల రాజవర్థన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరంతా ఈ నియోజకవర్గానికి వలస నాయకులే.2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున కోండ్రు మురళీ గెలుపొంది మంత్రి పదవి కూడా చేపట్టారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున కొండ్రు మురళి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంబాల జోగులు చేతిలో ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో మరోసారి కోండ్రు మురళి, కంబాల జోగులు పోటీ చేయగా వైసిపి ఎమ్మెల్యేగా కంబాల జోగులు రెండో సారి విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ముచ్చటగా మూడోసారి టిడిపి అధిష్టానం కోండ్రు మురళికి టిక్కెట్టు కేటాయించింది. వైసిపి సిటింగ్‌ ఎమ్మెల్యే కంబాల జోగులపై సర్వే నిర్వహించి ఆ సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా రావడంతో జోగులను పాయకరావుపేటకు బదిలీ చేసి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించారు. అనంతరం పరిమాణాల దృష్ట్యా ఆర్థోపెటిక్‌ వైద్యులు తలే రాజేష్‌కు అనూహ్యంగా నియోజకవర్గ వైసిపి ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించి టిక్కెట్టు కూడా ఆయనకే కేటాయించారు. పిసిసి అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంబాల రాజ వర్ధన్‌ను బరిలోకి దించారు. అయితే టిడిపి తరఫున పోటీ చేస్తున్న కోండ్రు మురళి ఇంజనీర్‌ కాగా, వైసిపి తరఫున పోటీ చేస్తున్న తలే రాజేష్‌ ఎంబిబిఎస్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న కంబాల రాజవర్ధన్‌ ఎంసిఎ ఉన్నత చదువులు అభ్యసించారు. ఈ ముగ్గురు విద్యావంతులైనప్పటికీ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండి ముమ్మరంగా ప్రచారాలు చేపడుతున్నారు బిఎస్‌పి ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధుడు ఉపాధ్యాయ వృత్తి చేసి పదవీ విరమణ పొందారు. రాజాం నియోజకవర్గ జనసేన ఇంఛార్జిగా ఉంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎన్ని రాజు గత టిడిపి హయాంలో పాలకొండ జెడ్‌పిటిసిగా పని చేశారు. అయినప్పటికీ ఇక్కడ టిడిపి, వైసిపి నాయకుల మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. కాగా రెండు సార్లు ఓటమి చెందిన కోండ్రు మురళీకి సానుభూతి కలిసొచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కాగా ఈ నియోజకవర్గంలో మూడోసారి వైసిపికే ప్రజలు పట్టం కడతారని వైసిపి నమ్మకంతో ఉంది. దీంతో ఎవరు విజయం సాధిస్తారో అంచనాలు వేయలేకపోతున్నట్లు విశ్లేషుకులు చెబుతున్నారు.

➡️