సిపిఎం మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా జొన్నా శివశంకరరావు

Apr 8,2024 23:47

ప్రజాశక్తి – మంగళగిరి : మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి ‘ఇండియా’ ఫోరం పార్టీలైన కాంగ్రెస్‌ పార్టీ, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు పోటీ చేస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సోమవారం రాత్రి ప్రకటించారు. 1955 అక్టోబర్‌ 4న పేద రైతు కుటుంబంలో జన్మించిన జొన్నా శివశంకరరావు ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ)లో నాయకులుగా, ప్రజానాట్యమండలి కళాకారుడిగా, యువజన సంఘం నాయకునిగా, సిపిఎం సభ్యుడిగా 1980 నుండి పనిచేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పసుపు రైతు రాష్ట్ర సంఘం కన్వీనర్‌గా పనిచేసే అనేక ఉద్యమాలను నడిపారు. పోరాట సమయంలో ఆరు నెలల పాటు రహస్య జీవితం, మూడు నెలలపాటు జైలు జీవితం గడిపారు. 1981 నుండి 2001 వరకు ఉండవల్లి సర్పంచ్‌గా 20 ఏళ్లపాటు పనిచేశారు. సిపిఎం ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా, తాడేపల్లి డివిజన్‌ కార్యదర్శిగా పనిచేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం ఉద్యమించి 6 వేల మందికి ఇళ్ల స్థలాలు సాధించి ఇల్లు కట్టించడంలో కీలకపాత్ర పోషించారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పోరాడారు. నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, రైతు సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్నారు. పెదవడ్లపూడి హైలెవెల్‌ ఛానల్‌ పూర్తి చేయాలని ఆందోళన చేశారు. కొండవీటి వాగులో తూటికాడ, గుర్రపు డెక్క తొలగించాలని ఆందోళన చేశారు. తెనాలి డెల్టా కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టాలని, తుపాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఆందోళనలు చేశారు. ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. పెంచిన ఇంటి పన్ను, చెత్త పనులు తగ్గించాలని ఆందోళన చేశారు. ఇలా నిరంతరం పోరాటాలే లక్ష్యంగా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

➡️